
సీనియారిటీ లేకున్నా పదోన్నతులు!
రవాణాశాఖలో వివాదాస్పద ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖలో పదోన్నతుల వ్యవహారం వివాదాస్పదంగా మారిం ది. జిల్లా రవాణాధికారి పోస్టుల భర్తీలో ఉన్న పదోన్నతి నిబంధనలు కాదని అస్మదీయుల కోసం గత సంవత్సరం ఓ ఉత్తర్వు జారీ అయింది. సాధారణంగా జిల్లా రవాణాధికారి పోస్టును మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌లకు సీనియారిటీ ప్రకారం పదోన్నతి ద్వారా భర్తీ చేస్తారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1 నియామకం ద్వారా నేరుగా భర్తీ చేయొచ్చు.
ఈ రెండు విధానాలు గత సంవత్సరం వరకు కొనసాగింది. పదోన్నతి ద్వారా అయితే సీనియారిటీ జాబితా రూపొందించి డీపీసీ ద్వారా భర్తీ చేయాలి. కానీ, కొందరు అధికారులు ప్రభుత్వంలో తమ పలుకుబడి ఉపయోగించుకుని సీనియారిటీ లేకున్నా పదోన్నతికి తెరదీశారు. ఎంటెక్, పీహెచ్‌డీ ఉన్నవారికి ఈ పదోన్నతి కల్పించొచ్చని రవాణా శాఖ ఓ ఉత్తర్వు జారీ చేసింది. దీని ప్రకారం ఈ రెండు ‘అర్హతలు’న్నవారు సీనియర్లను వెనక్కు నెట్టేసి పదోన్నతి పొందొచ్చు. ఈ మేరకు గత సంవత్సరం ముగ్గురు అధికారులకు పదోన్నతులు కల్పించారు.
తాజాగా సర్క్యులర్ జారీ...
ఇప్పుడు మరోసారి ఆ ఉత్తర్వును ఆధారం చేసుకుని జిల్లా రవాణాధికారి పోస్టులు భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ఉత్తర్వులో పేర్కొన్నట్టుగా అదనపు అర్హతలున్న వారి వివరాలు తెలపాలంటూ రవాణా శాఖ జిల్లా అధికారులకు సర్క్యులర్ జారీ చేసింది. వేరే రాష్ట్రాల్లో ఊరూపేరులేని సంస్థల నుంచి డిగ్రీ, ఇతర సర్టిఫికెట్లు పొంది వాటిని పేర్కొంటూ గతంలో నియామకాలు జరిపిన అంశంపై తీవ్ర వివాదం నెలకొంది. ఈ అంశం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. నాన్ టెక్నికల్ పోస్టు అయిన జిల్లా రవాణాధికారి పోస్టుకు ఎంటెక్ లాంటి డిగ్రీని అర్హతగా పేర్కొనటం విడ్డూరంగా ఉందని ఇతర సీనియర్ అధికారులంటున్నారు. ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకుని నిబంధనల ప్రకారం సీనియర్లకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.