
సాక్షి, హైదరాబాద్ : వైద్య ప్రొఫెసర్ల వయోపరిమితి పెంపును వ్యతిరేకిస్తూ.. గాంధీ అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్లు బుధవారం ధర్నాకు దిగారు. ఐదు రోజులపాటు సాముహిక సెలవులు ప్రకటించారు. దీంతో గాంధీ ఆసుపత్రిలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ప్రొసెసర్ల వయోపరిమితిని 60 ఏళ్లకు పెంచొద్దంటూ.. గాంధీ సూపరింటెండెంట్ కార్యాలయం నుంచి ఆసుపత్రి మెయిన్ గేట్ వరకు అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు నిరసన ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నించగా ఆందోళనలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు వారికి తెలిపారు. నిరసనకారులను అదుపు చేసేందుకు ఉన్నతాధికారులు భారీగా పోలీసులను మొహరించారు.
కాగా, నిరసనకారులు ఛలో రాజ్‌భవన్‌కు పిలునిచ్చారు. 100 కార్లలో రాజ్‌భవన్‌కు వెళ్తామని ప్రకటించారు. గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకుంటే రాజ్‌భవన్ గేటుకు వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే జూన్ 2 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో గాంధీలో ఐదు రోజులపాటు వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతాయి.