ప్రొటోకాల్ రగడ
శిలాఫలకంపై జిల్లా మంత్రుల పేర్లు లేవని నిరసన
కమిషనర్ దిష్టిబొమ్మ దహనం
కరీంనగర్ : జిల్లాలో మంత్రి హరీశ్‌రావు పర్యటన పూర్తయ్యాక ప్రొటోకాల్ రగడ మొదలైంది. శిలాఫలకంలో మంత్రుల పేర్లు లేకపోవడంతో ప్రొటోకాల్ వివాదం అధికారుల మెడకు చుట్టుకుంది. నగరంలోని 10వ డివిజన్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.33.22 లక్షలతో చేపట్టిన సీసీ డ్రెయిన్ శంకుస్థాపనకు ఏర్పాటు చేసిన శిలాఫలకంలో కేవలం మంత్రి హరీశ్‌రావు పేరు పెట్టి జిల్లాకు చెందిన మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్ పేర్లు చేర్చకపోవడాన్ని వివిధ సంఘాలు తప్పు పడుతున్నాయి. బీసీలను అణగదొక్కాలనే ఉద్దేశంతోనే మంత్రి ఈటెల రాజేందర్ పేరు చేర్చలేదని ఆరోపించారు. ప్రొటోకాల్ ఉల్లంఘించిన నగరపాలక సంస్థ కమిషనర్‌పై చర్య తీసుకోవాలని టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కట్ల సతీశ్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు అక్బర్‌హుస్సేన్, టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సిద్దం వేణు, తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతినాయక్ 42వ డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, యువజన నాయకులు డిమాండ్ చేశారు. ఈటెల యువసేన జిల్లా అధ్యక్షుడు మంద సుధీర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో కమిషనర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. తెలంగాణ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచకొండ సత్యనారాయణరావు ఆధ్వర్యంలో బీసీ కులాల ఐక్యవేదిక పక్షాన శిలాఫలకం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆందోళనలో బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ శ్రీధర్‌రాజు, కాల్వ నర్సయ్యయాదవ్, కడారి అయిలయ్య, మియాపురం రవీంద్రచారి, పిట్టల రమేశ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యామ లక్ష్మీరాజం, జిల్లా కార్యదర్శులు ఆర్పీ రాజు, మూల జయపాల్ పాల్గొన్నారు.
కమిషనర్ దిష్టిబొమ్మ దహనం
మంకమ్మతోట : నగరంలోని శనివారం మార్కెట్ యార్డులో ప్రారంభించిన అభివృద్ధి పనుల శంకుస్థాపన శిలాఫలకంపై మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్ పేర్లు రాయలేదని నిరసన వ్యక్తం చేస్తూ ఈటెల యువసేన, బీసీ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లో నగరపాలకసంస్థ కమిషనర్ శ్రీకేశ్‌లట్కర్ దిష్టిబొమ్మను మంగళవారం దహనంచేశారు. ఈ సందర్భంగా యువసేన జిల్లా అధ్యక్షుడు మంద సుధీర్, బీసీ సంఘం నగర అధ్యక్షుడు రమేశ్ మాట్లాడుతూ మంత్రుల ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడాన్ని ఖండించారు. ప్రభుత్వపరంగా కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు టి.విష్ణువర్ధన్, విజయ్, రావణవేని రాము, రాజేశ్, సంతోష్, కార్తీక్ పాల్గొన్నారు.