ప్రజా విశ్వాసమే మా బలం
టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు
సెంట్రల్ యూనివర్సిటీ: ప్రజా విశ్వాసాన్ని చూరగొన్న ప్రభుత్వాలలో తెలంగాణ సర్కార్ ముందంజలో ఉందని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీనేత కె.కేశవరావు అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనుబంధ క్యాంపస్ గోల్డెన్ త్రెషోల్డ్‌లో తెలంగాణ ఆవిర్భావ సంబరాలు నిర్వహించారు. హెచ్‌సీయూ, రాష్ట్ర భాషా సాంస్కృతిక విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో భాగంగా ‘తెలంగాణ ప్రభుత్వ ఏడాది పాలన’ అనే అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేకే మాట్లాడుతూ 67 శాతం ప్రజలు తెలంగాణ ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
వివిధ సంస్థల సర్వేల్లో సైతం ప్రభుత్వానికి మంచి మార్కులు లభించాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సౌకర్యాల కల్పన, అన్ని వర్గాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్, టీపీఎస్‌సీ సభ్యులు సి.విఠల్, హెచ్‌సీయూ ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ ఆర్.పి శర్మ, పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ వి. కృష్ణ, మేనేజ్‌మెంట్ స్టడీస్ ప్రొఫెసర్ వెంకట రమణ, దూర విద్యా కేంద్రం డెరైక్టర్ ఎస్.జిలాని తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జర్నలిజం, కళలు, సంస్కృతి, విద్య, ఉపాధి వంటి అంశాలపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. తెలుగు పరిశోధక విద్యార్థి వెంకటేష్ చౌహాన్ ఆలపించిన తెలంగాణ గీతాలు ఆలోచింపజేశాయి.
నాంపల్లి కోర్టులో ఆవిర్భావ వేడుకలు...
సాక్షి, సిటిబ్యూరో : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లి క్రిమినల్ కోర్టు ఉద్యోగులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి.రజని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు రాజ్‌కుమార్, సాయికళ్యాణ్ చక్రవర్తి, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి బి.లక్ష్మారెడ్డి, ఉద్యోగ సంఘం నేతలు నయీముద్దీన్, జి.బాలస్వామి, వనం శ్రీధర్, వీకే రమణమూర్తి, ఎ.వెంకటేశ్వర్లు, టి.సంజయ్‌రెడ్డి, ఖాజా మెయినుద్దీన్, సతీష్‌గౌడ్, సీహెచ్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సవాలను
విజయవంతం చేయాలి
సాక్షి, సిటీబ్యూరో: ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని టీఆర్‌ఎస్ నాయకుడు సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి గ్రేటర్ ప్రజలు పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు.