తెలంగాణ ముద్దుబిడ్డ.. పీవీ
- ఓరుగల్లుతో పెనవేసుకున్న బంధం
- తెలంగాణ రాష్ర్టంలో తొలిసారి అధికారికంగా పీవీ నర్సింహారావు జయంతి
- హన్మకొండలో నేడు విగ్ర హావిష్కరణ
వరంగల్: తెలంగాణ ముద్దు బిడ్డ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఓరుగల్లుకు గర్వకారణమైన వ్యక్తి. పీవీకి జిల్లాతో బాల్యం నుంచే ఆత్మీయ బంధం ఉంది. ఆయన తల్లిదండ్రులది కరీంనగర్ జిల్లా వంగర అయినప్పటికీ.. ఆయన మేనత్త గ్రామమైన నర్సంపేట నియోజకవర్గంలోని లక్నెపల్లిలో 1921 జూన్ 28న పీవీ జన్మించారు. తర్వాత మూడేళ్లకు ఆయన కరీంనగర్ జిల్లా వంగరకు వెళ్లిపోయారు.
ప్రాథమిక విద్యాభ్యాసం వంగరలో సాగింది. ఆ తర్వాత హన్మకొండలో పీయూసీ చదివారు. ఆ సమయంలో వరంగల్ నగరంతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆయన మిత్రులు, బంధువులు ఇక్కడే ఉన్నారు. కాళోజీ లాంటివారితో పాటు ఎందరో ఇక్కడ పీవీకి మిత్రులుగా ఉన్నారు. పీవీ నర్సింహారావు వరంగల్ నుంచి వారపత్రికను కూడా నిర్వహించారు.
ఉస్మానియూ యూనివర్సిటీలో డిగ్రీ, నాగ్‌పూర్ యూనివర్సిటీలో లా చేశారు. పీవీ మొదటిసారి కరీంనగర్ జిల్లా మంథని నుంచి 1957లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. 1977, 1980లో అప్పటి హన్మకొండ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. కేంద్రమంత్రిగా విదేశీవ్యవహారాలు, వాణిజ్య శాఖ, మానవనరుల శాఖలు నిర్వహించారు. తదుపరి ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1991 నుంచి 1996 వరకు ఆయన ప్రధానిగా పనిచేశారు.
ప్రధాని అయిన తర్వాత 1991లో కర్నూలు జిల్లా నంద్యాల నుంచి 1996లో ఒరిస్సా రాష్ట్రంలోని బరంపుర నుంచి ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు 1984లో హన్మకొండ నుంచి మూడవసారి పోటీచేసిన పీవీ నర్సింహారావు బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఆయన వరంగల్ జిల్లా నుంచి పోటీచేసేందుకు విముఖత చూపారు. 1984లో హన్మకొండలో ఓటమిపాలైనా మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా గెలుపొందారు. మరోసారి 1989లో అక్కడి నుంచే పోటీచేసి గెలుపొందారు.
రాజకీయ దురంధరుడిగా..
రాజకీయ నేతగా, సాహితివేత్తగా, బహుభాషా కోవిదుడిగా ఆయనకు పేరున్నది. ప్రధాన మంత్రిగా దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి పెనుమార్పులకు నాంది పలికారు. ప్రతిష్టాత్మకమైన భూ సంస్కరణలు రాష్ట్రంలో ఆయన హయూంలోనే చేపట్టారు. రాష్ట్ర, కేంద్ర స్థాయి రాజకీయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకేగారు.
ప్రధానమంత్రిగా పనిచేసిన పీవీ నర్సింహారావు..వరంగల్ జిల్లా అభివృద్ధిపై తగిన దృష్టిపెట్టలేదనే అపప్రద మిగిలిం ది. అత్యున్నత స్థానానికి చేరుకున్నప్పటికీ అం దివచ్చిన అవకాశాన్ని జిల్లా అభివృద్ధికి ఉపయోగించకపోవడంపై ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగానే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఆయన కీలక స్థానంలో ఉన్న సమయంలో ఇక్కడి నుంచి పోటీచేసి ఓటమిపాలు కావడంతో ఆయన ఈ ప్రాంతం పై దృష్టిపెట్టలేదని సన్నిహితులు చెబుతుం టారు.
ఆయన చివరి ప్రస్థానంలో చీకట్లుకమ్ముకున్నా తొలి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే వెలుగు రేఖలు ప్రసరిస్తున్నాయి. మరోసారి జిల్లా రాజకీయ చిత్రపటంపై ఆయన జ్ఞాపకాలు విచ్చుకుంటున్నాయి. పీవీ జయంతి ఉత్సవాలను శనివారం అధికారికంగా జరుగుతాయి. ప్రభుత్వ కార్యాలయూలు, విద్యా సంస్థ ల్లో జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు.
నేడు విగ్రహావిష్కరణ
శనివారం పీవీ నర్సింహారావు జయంతిని పురస్కరించుకొని హన్మకొండబస్‌స్టేషన్ సెంటర్ లో జెఎన్‌ఎస్‌గ్రౌండ్ ప్రమరీని ఆనుకొని భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆయన చిరకాల మిత్రులు, సన్నిహితులు కలిసి ఉన్న ‘ఏకశిల ఎడ్యుకేషన్ సొసైటీ’ ప్రతినిధులు పొద్దుటూరి గంగారెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డాక్టర్ విశ్వనాథరావు, ఆల్లూరి మూర్తిరాజు, పి.నారాయణరెడ్డి, టి.రవీందర్‌రావు, మోహన్‌రావు, విశ్వేశ్వర్‌రావు, సాయిరెడ్డి ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం సాయంత్రం 4-30గంటలకు పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య, ప్రత్యేక అతిథిగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పా ల్గొననున్నారు. ఈ మేరకు ఏకశిల ఎడ్యుకేషన్ సోసైటీ అందరికీ ఆహ్వానాలు అందజేసింది.