ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కాళోజీ సెంటర్(వరంగల్): కరోనా వ్యాప్తి నేపధ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యక్ష బోధన చేపట్టే పరిస్థితి లేదని ప్రభుత్వం గుర్తించి ఈ విద్యాసంవత్సరం (2021–22) కూడా ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో 1, 2 తరగతుల విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి డిజిటల్ పాఠాలు ప్రారంభించనున్నారు.
ప్రైవేట్ విద్యాసంస్థలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంగించరాదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థుల ఇళ్లల్లో టీవీ లేకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయాలు, గ్రంథాలయాల్లో, స్మార్ట్ ఫోన్‌లో తరగతులు వినే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి తెలిపారు. గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది అందుకు తగిన ఏర్పాట్లు చేపట్టారు. 6,7,8 తరగతులు చదువుతున్న 44,918 మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వీరందరికి పాఠశాలలు ప్రారంభం రోజు నుంచి పుస్తకాలను పంపిణీ చేయనున్నారు.
విధులకు 50 శాతమే హాజరు
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పాఠశాలలకు రోజుకు 50 శాతం సిబ్బంది హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. విధులకు హాజరైన టీచర్లు విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులు వింటున్నారా? లేదా అనేది పర్యవేక్షణ చేయనున్నారు. డిజిటల్ తరగతుల సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి సౌకర్యం లేకపోతే వెంటనే అందుబాటులో ఉన్న విద్యార్థుల ఇంటి వద్ద వినేవిధంగా ఉపాధ్యాయులు చర్య తీసుకోవాలని. గతంలా కాకుండా ఈ ఏడాది మార్కుల ఆధారంగానే ఉత్తీర్ణులను చేసే అవకాశం ఉందని, అందుకు విద్యార్థులను తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ముందుగానే విద్యార్థులకు వర్క్‌షీట్ అందజేస్తారు.
ఏర్పాట్లు పూర్తి..
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే విద్యార్థులను సిద్ధం చేశాం. ఈ సారి పిల్లల ప్రొగ్రెస్‌ను బట్టి మార్కులు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతీ విద్యార్థి డిజిటల్ తరగతులు వినే విధంగా చూసుకుంటే మంచిది. ఉపాధ్యాయులు కూడా పిల్లల ఇళ్లల్లో డిజిటల్ తరగతులు వింటున్నారా?లేదా అనేది పర్యవేక్షణ చేయాలి.
– వాసంతి, డీఈఓ
చదవండి: కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు
Comments
Please login to add a commentAdd a comment