
తల్లాడ : రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ పథకం ఆభాసు పాలవుతుంది. మండలంలో ఈ పథకం ద్వారా నిర్మిస్తున్న ఇళ్లు నాసిరకమైన పనులతో జరుగుతున్నాయి. సొంతింటి కల నెరవేరుతుందన్న పేదలకు ఆ ఇళ్లు ఎన్ని రోజులుంటాయోననే భయం పట్టుకుంది. బేస్‌మట్టం సరిగా లేకుండా డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నారు. మండలంలోని రామచంద్రాపురంలో 13, వెంగన్నపేట గ్రామంలో 20, పినపాకలో 40, గోపాలపేటలో 50 ఇళ్లు నిర్మిస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లన్నీ ప్టాస్టింగ్ చేస్తున్నారు. ఒక్కో ఇంటికి రూ.5.65 లక్షలు వెచ్చించి నిర్మిస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లను నిర్మిస్తున్నారు. మండలంలో నిర్మిస్తున్న ఇళ్లు కల్లూరుకు చెందిన కాంట్రాక్టర్ దక్కించుకొని నిర్మిస్తున్నాడు.
నాసిరకమైన ఇసుకతో..
నాసికరమైన ఇసుకతో ఇళ్లు నిర్మిస్తున్నారు. కుర్నవల్లి, పినపాక, గొల్లగూడెం సమీపంలోని వాగుల వద్ద దొరికే రాళ్ల ఇసుకను వాడుతున్నారు. గోదావరి నుంచి ఇసుకను తెచ్చి వాడాల్సి ఉండగా ఖరీదు ఎక్కువని, స్థానికంగా దొరికే రాళ్ల ఇసుకను తోలి కట్టుబడికి ఉపయోగిస్తున్నారు. క్యూరింగ్ కూడా సరిగా ఉండటం లేదు. ఫలితంగా గోడలు కొద్ది రోజులకే పగుళ్లిస్తున్నాయి.
ఎమ్మెల్యే హెచ్చరించినా ..
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పినపాక గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన సమయంలో స్థానికంగా దొరికే రాళ్లు, దుబ్బ ఇసుకనే వాడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే సబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల పాటే గోదావరి ఇసుక తెప్పించి వాడి మళ్లీ స్థానికంగా దొరికే ఇసుకను వాడుతున్నారు.
దర్వాజాలు, కిటికీలు కూడా నాసిరకమైనవి పెడుతున్నారు. ఒకేసారి కొనుగోలు చేసి ఇళ్లకు అమర్చుతున్నారు. దీంతో తయారీలో కూడా నాణ్యత ఉండటం లేదు. వాటినే బెడ్ రూమ్ ఇళ్లకు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment