చక్కెర రాలే...
రేషన్ షాపులకు విడుదలకాని కోటా
స్టాక్ లేకపోవడమే కారణం
హసన్‌పర్తి : జిల్లా వ్యాప్తంగా రేషన్ షాపులకు చక్కెర నిలిచిపోరుుంది. సుమారు 15లక్షల మంది లబ్ధిదారులకు ఈ నెల చక్కెర అందలేదు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అన్ని రేషన్‌షాపుల్లో లబ్ధిదారులకు బియ్యంతో పాటు చక్కెర, ఇతర సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ నెలలో డీలర్లు లబ్దిదారులకు బియ్యం మాత్రమే ఇచ్చారు. చక్కెరతో పాటు ఇతర సరుకుల విషయమై ప్రశ్నించినప్పటికీ ఇంకా రాలేదని సమాధానం చెప్పారు. స్టాక్ లేకపోవడం వల్ల ఈ నెల (మార్చి)లో చక్కెర కోటా విడుదల చేయలేకపోయినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. డీలర్లు ప్రతీ నెల మాదిరిగానే ఈ నెల కూడా యధావిధిగా బియ్యంతో పాటు చక్కెరకు డీడీలు చెల్లించారు.
ఇప్పటి వరకు చక్కెర చేరకపోవడంతో అబ్ధిదారులకు సమాధానం చెప్పలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2018 రేషన్‌షాపులు ఉండగా మార్చిలో ఎక్కడ కూడా చక్కెర విడుదల కాలేదు. ప్రతి షాపునకు ప్రతీ నెలా రెండున్నర క్వింటాళ్ల నుంచి మూడు క్వింటాళ్ల వరకు చక్కెర విడుదలవుతుంది. ఒక్కో రేషన్ షాపులో సుమారు ఐదువందల నుంచి ఆరువందల కార్డుల వరకు ఉన్నాయి.