
సైన్యం లేని సైన్యాధిపతిలా విద్యామంత్రి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పరిస్థితి సైన్యంలేని సైన్యాధిపతి మాదిరిగా తయా రైందని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీల్లో 70 శాతం టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికే 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మూడేళ్లలో నియామక ప్రక్రియను చేపట్టక పోవడంతో టీచర్‌పోస్టుల ఖాళీలు 40 వేలకు చేరాయన్నారు. బోధనా సిబ్బందితో పాటు బోధ నేతర పోస్టులను కూడా భర్తీ చేయాలని కోరారు.
సర్కారు బడుల్లోనూ అడ్మిషన్ వయసును తగ్గించండి: గాదరి
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్‌కు వయసు ఒకే విధంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్ సర్కారుకు విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు పాఠ శాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు మూడవ ఏటనే అడ్మిషన్ కల్పిస్తుండటం వలన ప్రభుత్వ పాఠశాలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్‌కు ప్రస్తుతం ఉన్న ఐదేళ్ల వయసును మూడేళ్లకు తగ్గించాలన్నారు.
ఇంగ్లిష్ మీడియం ఓరియెంటేషన్ పెరగాలి: జలగం
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఓరియెంటేషన్ పెరగాలని ఎమ్మెల్యే జలగం వెంకటరావు సూచించారు. కేజీబీవీల్లో బెంచీలు, మంచాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖలో పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయని, ఇన్‌చార్జ్‌ల స్థానంలో రెగ్యులర్ ఎంఈవోలు, డిప్యూటీ ఈవోలను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు.