సాగర్ రబీ లెక్కలు తేలేది నేడే!
- తమతమ అవసరాలతో నివేదికలు సిద్ధం చేసుకున్న తెలంగాణ, ఏపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రబీ సాగునీటి అవసరాలకు నాగార్జునసాగర్ నుంచి విడుదల చేసే నీటిపై మంగళవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాలు తమ అవసరాల చిట్టాను కృష్ణా బోర్డుకు సమర్పించాయి. ముందుగా ఇరు రాష్ట్రాలు చర్చించుకొని అవగాహనకు రావాలని, తర్వాతే సమావేశం ఏర్పాటు చేస్తామంటూ బోర్డు సూచించిన నేపథ్యంలో.. రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు మంగళవారం సమావేశం కానున్నారు.
ఇప్పటి వరకు నాగార్జున సాగర్‌లో నీటిని కుడి, ఎడమ కాల్వల కింద సాగు అవసరాలకు అనుగుణంగా విడుదల చేసేవారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో.. సాగర్‌లో ఉన్న నీటిని ఇరు రాష్ట్రాలు పంచుకోనున్నాయి. ఈమేరకు రబీ అవసరాల లెక్కలతో ఇరు రాష్ట్రాలూ సిద్ధమయ్యాయి. నాగార్జున సాగర్‌లో ఉన్న నీటి నిల్వను రెండు రాష్ట్రాల డిమాండ్లకు అనుగుణంగా కేటాయించడానికి ఏమాత్రం సరిపోదు.
సాగర్ జలాలపై ఆధారపడి మొత్తంగా 22 లక్షల ఎకరాల సాగు ఆధారపడి ఉండగా అందులో.. కుడి కాల్వ కింద 11 లక్షలు, ఎడమ కాల్వ కింద మరో 11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా డెల్టా కింద గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు 15 లక్షల ఎకరాలు ఆధారపడి ఉంది. ఇందులో గుంటూరు 6.69లక్షల ఎకరాలు, ప్రకాశంలో4.49 లక్షల ఎకరాలు, కృష్ణాలో 3.75 లక్షల ఎకరాల సాగు ఆధారపడి ఉంది.
ఇక తెలంగాణలో నల్లగొండ జిల్లా పరిధి లో కెనాల్‌ల కింద 2.80 లక్షల ఎకరాలు, లిఫ్ట్‌ల కింద 47వేల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో మరో 2.82లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగర్ నీటికి కుడి కాల్వకు 132 టీఎంసీలు, ఎడమ కాల్వకు 132 టీఎంసీల కేటాయింపులుండగా, ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎడమ కాల్వ కింద 96 టీఎంసీలు, కుడి కాల్వ కింద 99 టీఎంసీల నీటి వినియోగం జరిగిపోయింది. రెండు కాల్వల కింద రబీ అవసరాలకు మిగిలిన 77 టీఎంసీల నీటిని వినియోగించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ప్రాజెక్టులో 255.1 టీఎంసీల మేర నీరు ఉన్నప్పటికీ కనీస నీటిమట్టం 510 అడుగులకు లెక్కిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు 124 టీఎంసీలు మాత్రమే. ఇందులో కృష్ణా డెల్టా అవసరాలకు అందించే నీరు, తాగు నీటి అవసరాలైన ఏఎంఆర్‌పీ 5 టీఎంసీలు, సాగర్ కింద 8 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలు 11 టీఎంసీల మేర నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. వీటికి తోడు వేసవిలో మరో 7 నుంచి 8 టీఎంసీల మేర ఆవిరి నష్టాలు ఉంటాయి.
ఇవన్నీ పోనూ.. సాగర్‌లో మిగిలేది 100 టీఎంసీలే. వచ్చే ఏడాది ఖరీఫ్ ప్రారంభ అవసరాల కోసం ఈ నీటినిల్వ నుంచే 95 టీఎంసీలను కచ్చితంగా నిల్వ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పోగా.. రబీకి మిగిలేది 5-6 టీఎంసీలే. గతేడాది రబీ అవసరాలకు 88 టీఎంసీల నీటిని వాడుకోగా, ప్రస్తుతం సాగర్‌లో ఉన్న 124 టీఎంసీలను ఎలా పంచుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది.