సాక్షి, హైదరాబాద్ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నూతన కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ప్రారంభించారు. మాదాపూర్ (హైటెక్ సిటీ) సమీపంలోని ఖానామెట్ గ్రామంలో నిర్మించిన ఎన్‌ఐఏ కార్యాలయంతో పాటు రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌కు రాజ్‌నాథ్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ... ప్రపంచంలోనే అత్యంత పకడ్బందీగా దర్యాప్తు చేసే సంస్థగా ఎన్‌ఐఏకు గుర్తింపు ఉందన్నారు. ఎన్‌ఐఏ దర్యాప్తులో అత్యంత కీలకమైన ఆధారాలు వెలుగులోకి వచ్చాయని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఉగ్రవాదులతో ముడిపడి ఉన్న కేసులను ఎన్‌ఐఏ దర్యాప్తు జరుపుతుందని తెలిపారు.
పుల్వామా ఉగ్రదాడి అత్యంత దారుణమన్న రాజ్‌నాథ్... ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలని పిలుపునిచ్చారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉగ్రవాదాన్ని తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ప్రపంచం అంతా పోరాడుతుందని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్నామని అన్నారు. ప్రపంచంలో టెర్రరిస్టులను తరిమికొట్టేందుకు అన్ని దేశాలు కృషి చేస్తున్నాయన్నారు. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై దాడి అనంతరం భారత్ నుంచి ఉగ్రవాదులను తరిమి కొట్టేందుకు ప్రధాని మోదీ కంకణం కట్టారన్నారు.
ఉగ్రవాదులను అంతం చేసేందుకు దేశమంతా ఒకే వేదికపై ఉందని తెలిపారు. దేశంలో మార్పు కోసం అన్ని సంస్థలతో పాటు ఎన్‌ఐఏ పాత్ర కూడా ఉండాలన్నారు. ఐఎస్‌ఐఎస్‌పై విచారణ చేపట్టేందుకు ఎన్‌ఐఏకి హోంశాఖ పూర్తి స్వేచ్ఛనిచ్చిందని రాజ్‌నాథ్ వెల్లడించారు. ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ కార్యాలయాలు ఉన్నాయని, లేని ప్రాంతాల్లో సైతం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హోంమంత్రి మహమ్మద్ అలీ, అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment