
రంజాన్‌కు జానిమాజ్‌లు రెడీ!
రంజాన్ కు జానిమాజ్‌లు మార్కెట్లోకి వచ్చేశాయి...
చార్మినార్ : రంజాన్ కు జానిమాజ్‌లు మార్కెట్లోకి వచ్చేశాయి. ముస్లింలు నమాజ్ చేసే సమయంలో నేలపై పరిచే పవిత్ర వస్త్రం జానిమాజ్. ముఖ్యంగా రంజాన్ మాసంలో జానిమాజ్‌లపై కూర్చుని ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. రంజాన్ మాసం మరో 12 రోజుల్లో ప్రారంభం కానుంది. రంజాన్ షాపింగ్ అంటే దుస్తులు, టోపీలు, సుర్మా,డ్రైఫ్రూ ట్స్‌తో పాటు ఇతర అన్ని అవసరాలు కలగలిసి ఉంటాయి. జానిమాజ్‌లను కూడా కొనుగోలు చేసే సంస్కృతి రానురాను నగరంలో కూడా పెరిగింది. ఎంతో మంది తమ ఇళ్లలోకి, మసీదుల్లోకి జానిమాజ్‌లను కొనుగోలు చేయడాన్ని పుణ్యకార్యంగా భావిస్తున్నారు. ఆత్మీయుల స్మృత్యర్థం వాటిని మసీదులకు అందజేస్తున్నారు.
నెల పాటు కొనసాగనున్న ప్రదర్శన..
సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా, మదీనాలలోని మసీదుల్లో ఉన్నటు వంటి జానిమాజ్‌లపై తమ నమాజ్‌ను పూర్తి చేయాలని ప్రతి ముస్లిం కోరుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రాచుర్యంలో ఉన్న జానిమాజ్‌లను మదీనా సర్కిల్‌లోని మహ్మద్ క్యాప్ మార్ట్ ఒకే వేదికపైకి తీసుకు వచ్చి నెల రోజుల పాటు కొనసాగే అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ అంతర్జాతీయ జానిమాజ్‌ల ఎగ్జిబిషన్‌ను మౌలానా సుల్తాన్ అహ్మద్ ఆదివారం ప్రారంభించారు. దాదాపు 108 సంవత్సరాల నుంచి వ్యాపార రంగంలో ఉన్న మహ్మద్ క్యాప్ మార్ట్ నాలుగో అంతస్తులో 3 వేల చదరపు అడుగుల స్థలాన్ని జానిమాజ్‌ల ప్రదర్శనకు కేటాయించింది. బ్లూ, బీజ్, లేత, ఎరుపు, ఆకుపచ్చలతో పాటు మరె న్నో వర్ణాలలో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్బంగా మహ్మద్ క్యాప్ మార్ట్ యజమాని మహ్మద్ ఇలియాస్ బుకారి విలేకరులతో మాట్లాడుతూ... ఇస్లాం సంస్కృతిని, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే విధంగా మృదువైన వస్త్రంతో రూపొం దించిన అందమైన జానిమాజ్‌లను మహమ్మద్ క్యాప్ మార్ట్ రూపొందించిందన్నారు.
సౌదీ అరేబియా, టర్కీ, ఇరాక్, బెల్జియం, మలేషియా, భారత్‌లలో లభ్యమయ్యే జానిమాజ్‌లను ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసామన్నారు. తమ వద్ద రూ.360 నుంచి రూ.1200 వరకు అందుబాటులో ఉన్నాయన్నారు.