
ఐసీయూలోని రోగికి సమీపంలో ఎలుక
సాక్షి, సిటీబ్యూరో: నిమ్స్‌లో ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులు చికిత్స పొందే అత్యవసర విభాగం (ఈఎండీ)లో విచ్చలవిడిగా ఎలుకలు తిరుగుతున్నాయి. ఆక్సిజన్ పైప్‌లైన్లపై స్వైరవిహారం చేస్తున్నాయి. రోగులకు సంబంధించిన కీలక కేస్‌షీట్లు, మెడికల్ రిపోర్టులను పాడు చేస్తున్నాయి. రోగుల మధ్యే తిరుగుతున్న ఎలుకలు, బొద్దింకలు, ఇతర కీటకాలను ఎప్పటికప్పుడు నిర్మూలించాల్సిన పారిశుద్ధ్య విభాగం అసలు ఈ విషయాన్ని పట్టించుకోక పోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నల్లులు, ఎలుకలపై ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిమ్స్ అత్యవసర విభాగంలో నిత్యం వంద మందికిపైగా చికిత్స పొందుతుంటారు. సాధారణ వార్డులతో పోలిస్తే అత్యవసర విభాగం(ఈఎండీ) కొంత భిన్నమైంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో రోగులను మినహా ఇతరులెవరినీ లోనికి అనుమతించరు.
నిమ్స్‌లోనూ ఆంక్షలు ఉన్నప్పటికీ..రద్దీ ఎక్కువగానే ఉంటుంది. నిత్యం రోగులు, వారి బంధువులతో రద్దీగా ఉంటే అత్యవసర విభాగంలోనూ ఎలుకలు సంచరిస్తుండటం, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితులకు ఆక్సిజన్ సరఫరా చేసే వెంటిలేటర్లు, ఆక్సిజన్ పైపులపై తిరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది.
అంతర్గత ఇన్‌ఫెక్షన్‌కు ఇదే కారణం
ఆస్పత్రిలో పారిశుద్ధ్యం, పెస్ట్ కంట్రోల్ పనుల కోసం నెలకు రూ.రెండు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అయినా ఫలితం లేదు. ఎలుకలు, పరుపుల కింద నల్లులు, గోడలపై బల్లులు, బొద్దింకలు, ఇతర కీటకాలు సంచరిస్తూనే ఉన్నాయి. బ్యాక్టీరియా, వైరస్‌లు వ్యాపించి అంతర్గత ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతున్నాయి. ఫలితంగా వారం రోజుల్లో కోలుకోవాల్సిన రోగులు పదిహేను రోజుల వరకు ఆస్పత్రిలోనే మగ్గాల్సి వస్తుంది. అంతర్గత ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి బయటపడేందుకు ఖరీదైన యాంటీబయాటిక్స్ మందులను వాడాల్సిన దుస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment