
టీఎన్‌జీఓ అధ్యక్షునిగా రవీందర్‌రెడ్డి
గౌరవ అధ్యక్షునిగా దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా హమీద్
హైదరాబాద్: తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం (టీఎన్‌జీఓ) రాష్ట్ర అధ్యక్షునిగా కారెం రవీందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఎన్‌జీఓ కార్యాలయంలో ఆదివారం జరిగిన కేంద్ర కార్యవర్గ కమిటీ అత్యవసర సమావేశంలో రవీందర్‌రెడ్డితోపాటు దేవీప్రసాద్‌ను గౌరవ అధ్యక్షునిగా, ఎంఏ హమీద్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు.
రవీందర్‌రెడ్డి గతంలో ఐదేళ్లపాటు వరంగల్ జిల్లా టీఎన్‌జీఓ అధ్యక్షునిగా, 2012 నుంచి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పటివరకు టీఎన్‌జీఓ అధ్యక్షునిగా ఉన్న దేవీప్రసాద్, ఉద్యోగానికి రాజీనామా చేసి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సంఘం అధ్యక్ష పదవి నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. దీంతో సంఘం అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించారు. కాగా, దేవీప్రసాద్ సేవలు సంఘానికి, ఉద్యోగులకు అవసరమని ఆయనను గౌరవ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగతా కార్యవర్గసభ్యులు పాతవారే కొనసాగుతారు.