
బార్లు ఆ పరిధిలోకి రావు: ఏజీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులకు 500 మీటర్ల లోపు ఉన్న మద్యం షాపులన్నిం టినీ మూసేయాలంటూ సుప్రీంకోర్టు ఇటీ వల ఇచ్చిన తీర్పుపై ఆందోళన చెందుతున్న బార్ అండ్ రెస్టారెంట్ల యాజమానులకు అటార్నీ జనరల్ (ఏజీ) ముకుల్ రోహత్గీ తీపి కబురు చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జాతీయ రహదారుల వెంట 500 మీటర్ల లోపు ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లకు వర్తించదని, కేవలం మద్యం దుకాణాలకే వర్తిస్తుందని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో జాతీయ రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలను ఈ నెలాఖరు కల్లా మూసివేయాలి.
ఈ తీర్పు వల్ల తమకు ఆదాయపరంగా భారీ నష్టం కలుగుతుం దని, బార్ అండ్ రెస్టారెంట్ల విషయంలో తమకు కొంత స్పష్టతనివ్వాలంటూ కేరళ ప్రభుత్వం ఇటీవల ఏజీ అభిప్రాయాన్ని కోరింది. దీంతో బుధవారం ఆయన ఈ మేరకు కేరళ ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తన అభిప్రాయాన్ని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పులో ఎక్కడా బార్ అండ్ రెస్టారెంట్ల గురించి చెప్పలేదని, మద్యం దుకాణాల మూసివేత గురించే చెప్పిందని వివరించారు. మద్యం దుకాణాలకు, బార్ అండ్ రెస్టారెంట్లకు వ్యత్యాసం ఉందన్న ఆయన, తీర్పు పరిధిలోకి బార్ అండ్ రెస్టారెంట్లు రావని స్పష్టం చేశారు. ఈ అభిప్రాయాన్ని దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా వర్తింపజేసుకోవచ్చు.