చిన్న చిన్న వినియోగదారులపై ప్రతాపం చూపించే విద్యుత్ అధికారులు పెద్ద వినియోగదారులతో కలిసిపోయి సంస్థకు సున్నం పెడుతున్నారు.
- ఇండస్ట్రీ మీటర్‌కు సాధారణ బిల్లు
- ఎనర్జీ ఆడిట్‌లో బయటపడిన వైనం
- విద్యుత్ శాఖలో వెలుగులోకి మరో అక్రమం
హన్మకొండ : చిన్న చిన్న వినియోగదారులపై ప్రతాపం చూపించే విద్యుత్ అధికారులు పెద్ద వినియోగదారులతో కలిసిపోయి సంస్థకు సున్నం పెడుతున్నారు. గతంలో ఇండస్ట్రీలకు సరఫరా చేసే విద్యుత్ సరఫరాలో పలు అక్రమాలు వెలుగుచూశాయి. తాజాగా హెచ్‌టీ మీటర్‌లో రీడింగ్ మోసానికి పాల్పడిన ఉదం తం మరొకటి బయటకు పొక్కింది. ఈ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు.
వరంగల్ అర్బన్ పరిధి ములుగురోడ్డు ఏడీఈ సర్కిల్‌లో కొత్తవాడ కింద 1997లో ఓంకార్ కాటన్ ఇండస్ట్రీకి ముందుగా 5149-30815 నంబరు మీటర్‌తో ఎల్‌టీ సరఫరా ఇచ్చారు. అయితే మూడేళ్ల క్రితం ఈ సర్వీసును హెచ్‌టీకి మార్చారు. 25హెచ్‌పీ కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తే ఎల్‌టీ సర్వీసును హెచ్‌టీకి మార్చాల్సి ఉంటుంది. మల్టిపుల్ ఫ్యాక్టరీ(ఎంఎఫ్-1) నుంచి ఎంఎఫ్-2కు మార్చాల్సి ఉంది. దీని ప్రకారం ఎంఎఫ్-1లో ఉంటే సాధారణ రీడింగ్‌లో తేడా ఉండదు.
ఈ వినియోగదారుడు గత నెలలో 6452 యూనిట్ల విద్యుత్‌ను వాడుకున్నాడు. అంటే ఎంఎఫ్-1లో ఈ విద్యుత్‌కే బిల్లు వస్తుంది. వాస్తవంగా ఈ సర్వీసు హెచ్‌టీ ఎంఎఫ్-2 కేటగిరిలో ఉంది. బిల్లు రెండింతలు వేయాలి. ఇక్కడ అధికారులు మాత్రం 6452 యూనిట్లకు మాత్రమే బిల్లు వేశారు. దీంతో ఇండస్ట్రీ యూనిట్ ధర ప్రకారం రూ.75 వేల బిల్లు తక్కువగా వేశారు. దాదాపు మూడు సంవత్సరాల నుంచి తక్కువ బిల్లునే ఇస్తున్నారు.
ఇప్పుడేమైందంటే..?
కొత్తవాడ ఫీడర్‌లో చాలా మేరకు లైన్ లాస్ జరుగుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఎనర్జీ ఆడిట్ విభాగం హెచ్చరిం చింది. దీంతో ములుగు రోడ్డు సర్కిల్ ఏడీఈ తిరుపతి ఈ రీడింగ్ విషయాన్ని బయటకు తీశారు. ఎల్‌టీ సర్వీసు నుంచి హెచ్‌టీగా మార్చినప్పటి నుంచి ఎంఎఫ్-2లో బిల్లు ఇవ్వడం లేదని, ఎక్కువ యూనిట్లు వాడుతున్నా తక్కువ యూనిట్లు నమోదవుతున్నట్లు తేల్చారు. సర్వీసు మార్చినప్పటి నుంచి ఇదే విధంగా జరుగుతోందంటూ ఇప్పటికిప్పుడు పాత లెక్కలు తీసి రూ.9.80 లక్షలు వినియోగదారునికి జరిమానా విధించారు.
అధికారుల నిర్లక్ష్యం
వాస్తవంగా హెచ్‌టీ మీటర్‌ను ఆయా విభాగాలు తనిఖీ చేయాల్సి ఉంటుంది. దీనికోసం సర్కిల్‌లో హెచ్‌టీ మీటర్ ఏడీఈ, ఆపరేషన్ ఏడీఈ, ఏఈలు ప్రతినెలా రీడింగ్ తనిఖీ చేసి, బిల్లు తీయాల్సి ఉంటుంది. ఈ హెచ్‌టీ మీటర్‌ను పరిశీలించి మూడు నెలలకోసారి ఎంఆర్‌ఐ తీసి మీటర్ పని చేస్తుందా.. లేక ఏమైనా టాంపరింగ్ చేస్తున్నారా.. అనే విషయాలపై రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఉదంతాన్ని బట్టి సంబంధిత అధికారులంతా మూడేళ్లుగా తనిఖీలు చేయడం లేదనే విష యం రూఢీ అవుతోంది. రీడింగ్‌లో అక్రమం ఇప్పటికే ఎన్పీడీసీఎల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సీఎండీ కార్తికేయ మిశ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే.