
సీబీఐ విచారణకు సిద్ధమే
సీబీఐ విచారణకు టీఆర్‌ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు బెదిరేది లేదని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు హరీష్‌రావు అన్నారు.
పొన్నాల, బాబులు కూడా సిద్ధం కావాలి: హరీష్‌రావు
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: సీబీఐ విచారణకు టీఆర్‌ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు బెదిరేది లేదని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు హరీష్‌రావు అన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీబీఐ విచారణ పేరిట లొంగదీసుకోవాలని, పొత్తు కుదుర్చుకోవాలని పన్నిన కుట్రలను ఎదుర్కొంటామన్నారు. అనుకూలంగా లేని నేతలపై సీబీఐని ఉసిగొల్పడం కాంగ్రెస్‌కు పరిపాటే అన్నారు. 14 సంవత్సరాల నుంచి ఎన్నో కేసులను, కుట్రలను ఎదుర్కొన్నప్పటికీ ఉద్యమాన్ని వీడలేదన్నారు. కేసీఆర్, తాను ఆస్తులను బహిరంగపర్చామన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ త్యాగాలను మాట్లాడుతున్న కాంగ్రెస్‌కు తెలంగాణలోని 1,200 మంది ప్రాణత్యాగాలు కనిపించలేదా అని ప్రశ్నించారు. తల్లీకొడుకులు ఎప్పుడైనా ఆత్మత్యాగం చేసిన కుటుంబాలను పరామర్శించారా అని ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను కాపీ కొడితే ఓట్లు రాలవు
వరంగల్ సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను కాపీ కొడుతూ ప్రసంగించడం ఆ పార్టీ దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. కేసీఆర్ రూ. లక్ష రుణం మాఫీ చేస్తామంటే రాహుల్ రూ. రెండు లక్షలు మాఫీ చేస్తామంటున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభంజనం చూసి ఇంతవరకు చంద్రబాబు, పొన్నాల వణికిపోతే ఇప్పుడు నరేంద్రమోడీ, రాహుల్‌గాంధీ వణికిపోతున్నారన్నారు.
విచారణకు సిద్ధం: కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి
పాపన్నపేట, న్యూస్‌లైన్: తన ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నానని మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, సినీనటి విజయశాంతి స్పష్టం చేశారు. కేసీఆర్‌తో పాటు హరీశ్‌రావు, విజయశాంతిల ఆస్తులపై విచారణ జరపాలని కోర్జు ఆదేశాలపై ఆమె స్పందించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం అన్నారం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆమె మాట్లాడుతూ కేసీఆర్, హరీశ్‌రావులను ఉద్దేశించి వేసిన పిటిషన్‌లో తన పేరు కూడా చేర్చి ఉండవచ్చునని అన్నారు. ఈ విషయంలో ఏ క్షణంలోనైనా సీబీఐ విచారణకు సిద్ధం ఉన్నానని, తాను ఎలాంటి అక్రమాస్తులు కూడబెట్టలేదన్నారు.