ఆ ఒక్కరు ఎవరు..? | Rebel Trouble In Adilabad Congress | Sakshi
Sakshi News home page

ఆ ఒక్కరు ఎవరు..?

Published Thu, Nov 15 2018 12:33 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Rebel Trouble In Adilabad Congress - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌:కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల రెండో జాబితాలో ఖానాపూర్‌ సీటు మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌కు ద క్కింది. ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఏడింటికి తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్టానం ఖానాపూర్, బోథ్‌ సీట్లకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ రెండు సీట్లకు కూడా అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ వివిధ కారణాల వల్ల వారి పేర్లను తొలి జాబితాలో వెల్లడించలేదు.

రెండో జాబితాలో ఖానాపూర్‌ సీటును రమేష్‌ రాథోడ్‌కు ప్రకటించి న ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ బోథ్‌ను మాత్రం పెండింగ్‌లోనే ఉంచింది. మూడో జాబితాలో బోథ్‌కు కూడా అభ్యర్థిని ప్రకటిం చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ తరుపున లంబాడా వర్గానికి చెందిన బాపూరావు రాథోడ్‌ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆదివాసీ వర్గం నాయకుడు సోయం బాపూరావుకు సీటివ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. అయితే గతంలో ఇక్కడ పోటీ చేసిన అనిల్‌ జాదవ్‌కు టికెట్టు ఇవ్వాలని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పీసీసీ నేతల ద్వారా ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఆ సీటుపై రెండో  
జాబితాలోనూ  ఎటూ తేల్చలేదు. 


బెల్లంపల్లిలో సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్‌
మహాకూటమి పొత్తులో భాగంగా బెల్లంపల్లి సీటును సీపీఐకి కేటాయించిన విషయం తెలిసిందే. అయితే అభ్యర్థి ఎవరనే విషయంలో తొలుత కొంత సందిగ్థత ఏర్పడింది. వృద్ధాప్యం కారణంగా సీపీఐ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ గుండా మల్లేష్‌ పోటీ చేయరనే ప్రచారం జరిగింది. అదే సమయంలో సీపీఐ టికెట్టు కోసం మంథెన మల్లేష్, మిట్టపల్లి వెంకటస్వామి, దాగం మల్లేష్‌ పేర్లు తెరపైకి వచ్చాయి.

 మంగళవారం జరిగిన సీపీఐ పార్టీ కార్యదర్శివర్గ సమావేశంలో గుండా మల్లేష్‌ తానే పోటీ చేస్తానని చెప్పినట్లు తెలిసింది. కొత్త నాయకుడికి ఎవరికి సీటిచ్చినా తక్కువ సమయంలో జనంలోకి వెళ్లడం కష్టమని, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తనకే సీటివ్వాలని ఆయన కోరినట్లు తెలిసింది. దీంతో ఆయన పేరును ఖరారు చేశారు. గురువారం అధికారికంగా ప్రకటించనున్నారు. 


టీడీపీని వీడి... టీఆర్‌ఎస్‌ను వదిలి... కాంగ్రెస్‌ నుంచి రాథోడ్‌
టీడీపీ నుంచి ఏడాదిన్నర క్రితం టీఆర్‌ఎస్‌లో చేరిన రమేష్‌ రాథోడ్‌ ఆ పార్టీ నుంచి ఖానాపూర్‌ సీటు తనదేనని భావించి భంగపడ్డారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న రేఖానాయక్‌కే పార్టీ టికెట్టు ఇవ్వడంతో టీఆర్‌ఎస్‌ తనను మోసం చేసిందని విమర్శలు గుప్పించి కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యం లో రాథోడ్‌కు మాజీ ఎంపీల కోటా నుంచి కాంగ్రెస్‌ టికెట్టు ఖరారు చేసినట్లు ప్రచారం జరిగింది. ఇటీవల కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తెలిపిన 74 మంది జాబితాలో కూడా ఖానాపూర్‌ సీటును రమేష్‌ రాథోడ్‌కే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన హరినాయక్‌.. రమేష్‌కు సీటివ్వడాన్ని వ్యతిరేకిస్తూ గాంధీభవన్‌లో రెండు రోజుల పాటు ఆందోళన చేశారు. దీంతో సందిగ్ధంలో పడ్డ అధిష్టానం తొలి జాబితాలో ఆయన పేరును ప్రకటించలేదు. అయితే స్థానికంగా నెలకొన్న పరిస్థితులు, విజయావకాశాలు ఎవరికి ఉన్నాయన్న అంశంపై పలు సమీకరణాలను బేరీజు వేసుకున్న అధిష్టానం రమేష్‌ రాథోడ్‌కే టికెట్టు కేటాయించింది. దీంతో హరినాయక్‌ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్యారాచూట్‌తో వచ్చిన వ్యక్తికి పార్టీ ఎలా టికెట్టు ఇస్తుందని ఆయన వర్గం నిరసన వ్యక్తం చేస్తోంది. ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచే ప్రయత్నాల్లో హరినాయక్‌ ఉన్నట్లు సమాచారం. 


అరవింద్‌రెడ్డి వర్గంపై పీఎస్సార్‌ నజర్‌
మంచిర్యాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ టికెట్టు ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి వర్గంలోని ముఖ్య నాయకులను పార్టీ అభ్యర్థిగా ఖరారైన కె.ప్రేంసాగర్‌రావు ఆకర్షిస్తున్నారు. బుధవారం అరవింద్‌రెడ్డి గ్రూప్‌లోని పార్టీ జిల్లా కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్‌ కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ శ్రీపతి శ్రీనివాస్, వంగ దయానంద్‌ తదితరులు టీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ కౌన్సిలర్‌ బొలిశెట్టి కిషన్, మున్నూరుకాపు సంఘం నాయకురాలు శ్రీదేవి తదితరులు ప్రేంసాగర్‌రావుకు మద్దతు పలికారు.

గురువారం మంచిర్యాల క్లబ్‌ సమీపంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క, స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి, మాజీ మంత్రి డీకే.అరుణ తదితరులు హాజరు కానున్నారు. పీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కూడా ఆహ్వానించినట్లు చెపుతున్నా, ఆయన వచ్చే విషయంలో స్పష్టత లేదు. టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నాయకులు బహిరంగసభలో కాంగ్రెస్‌ కండువాలు కప్పుకోనున్నట్లు తెలిసింది. 


టీఆర్‌ఎస్‌లోకి అరవింద్‌రెడ్డి?
కాంగ్రెస్‌ టికెట్టు ప్రేంసాగర్‌రావుకు కేటాయించడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి తిరిగి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి గానీ బీఎస్పీ నుంచి గాని పోటీ చేస్తానని ప్రకటించిన అరవింద్‌రెడ్డి ప్రణాళిక ఏంటనే విషయంలో స్పష్టత రాలేదు. టీఆర్‌ఎస్‌లోకి వెళ్లే ఆలోచనతో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో హైదరాబాద్‌లో చర్చలు జరిపినట్లు సమాచారం. 16వ తేదీన మంచిర్యాలలో జరిగే కేటీఆర్‌ సభలో ఆయన టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. 


రెబల్స్‌గా కాంగ్రెస్‌ ఆశావహులు
కాంగ్రెస్‌ పార్టీ టికెట్టు ఆశించి భంగపడ్డ పలువురు నాయకులు రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. గుర్తు కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన ఏదైనా గుర్తింపు పొందిన పార్టీ టికెట్టు మీద గానీ, ఇండిపెండెంట్‌గా గానీ పోటీ చేసే ఆలోచనతో పలువురు పావులు కదుపుతున్నారు. రమేష్‌ రాథోడ్‌కు ఖానాపూర్‌ సీటు రావడంతో టికెట్టు కోసం పోటీ పడ్డ హరినాయక్‌ రెబల్‌గా నామినేషన్‌ వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి రామచంద్రారెడ్డి తటస్థంగా ఉంటారా? రెబల్‌గా బరిలో నిలుస్తారా? అనే విషయంలో స్పష్టత లేదు. ముథోల్‌లో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌ కాంగ్రెస్‌ రెబల్‌గా ఎన్‌సీపీ లేదా ఇతర పార్టీల గుర్తుపై పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. బోథ్‌లో ఇంకా టికెట్టు ఎవరికీ ఖరారు కాలేదు. ఇక్కడ పోటీలో ఉన్న సోయం బాపూరావు, అనిల్‌ జాదవ్‌లలో ఎవరికి టికెట్టు వచ్చినా మరొకరు రెబల్‌గా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement