సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో విద్యుత్ వినియోగం రికార్డుస్థాయిలో నమోదైంది. ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవడంతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్ల వినియోగం అనూహ్యంగా పెరిగింది. గత రెండురోజుల నుంచి విద్యుత్ వినియోగం రెట్టింపైంది. గతేడాది ఇదే సీజనల్‌లో 60 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగం నమోదు కాగా, ఈ ఏడాది మార్చి 28న 61 మిలియన్ యూనిట్లు నమోదైంది. తాజాగా బుధవారం 62.5 మిలియన్ యూనిట్లు నమోదైంది. డిస్కం చరిత్రలో విద్యుత్ వినియోగం ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి. రోజురోజుకు పెరుగుతున్న ఈ విద్యుత్ డిమాండ్ వల్ల ఒత్తిడిని తట్టుకోలేక అండర్ గ్రౌండ్ కేబుళ్లు కాలిపోతుండగా, సబ్‌స్టేషన్లలోని ఫీడర్లు తరచూ ట్రిప్పవుతున్నాయి. ముఖ్యంగా పీక్ అవర్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉత్పన్నం అవుతోంది. సాధారణంగా వాతావరణంలో తేమ 50 శాతం ఉండాల్సి ఉంది. కానీ గురువారం 36 శాతమే నమోదైంది. గతవారంతో పోలిస్తే నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ.. వాతవరణంలో తేమశాతం తక్కువగా నమోదు అవుతుండటం వల్ల ఉక్కపోత ఉంటుంది. ఈ ఉక్కపోతను తట్టుకోలేక వినియోగదారులు రోజంతా ఏసీలోనే గడుపుతుండటమే వినియోగం పెరగడానికి కారణమని డిస్కం ప్రకటిస్తుంది.
ట్రిప్పవుతున్న ఫీడర్లు.. నిలిచిపోతునన్న సరఫరా
చంపాపేట్ సర్కిల్ నందనవనం సబ్‌స్టేషన్ పరిధిలోని శ్రీరమణ కాలనీ ఫీడర్ ఓవర్‌లోడ్ వల్ల గత నాలుగైదు రోజుల నుంచి రోజుకు నాలుగైదుసార్లు ట్రిప్పవుతుంది. ఫలితంగా తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. రంగారెడ్డి నార్త్ సర్కిల్ పరిధిలోని కూకట్‌పల్లి సబ్‌డివిజన్ సబ్‌స్టేషన్ జివికాస్ సబ్‌స్టేషన్ కోకకోలా ఫీడర్ పరిధిలో యూజీ కేబుల్ దగ్ధమైంది. దీంతో ఆ ఫీడర్ పరిధిలోని కాలనీల్లో రెండు గంటల పాటు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. కందికల్‌గేట్ సబ్‌స్టేషన్ ఆషామాబాద్ ఫీడర్ పరిధిలో ఆర్‌ఎంయూలో సాంకేతికలోపం తలెత్తడం వల్ల సుమారు గంటన్నర పాటు సరఫరా నిలిచిపోయింది. ఆస్మాన్‌ఘడ్ డివిజన్‌లోని చంచల్‌గూడ సబ్‌స్టేషన్ ఆనందర్‌నగర్ ఫీడర్ ఏబీస్విచ్ సహా జంపర్ కట్ అయింది. ఫలితంగా ఆయా కాలనీల్లో గంటకు పైగా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. చార్మినార్ డివిజన్ కిలావత్‌సబ్‌స్టేషన్ పరిధిలోని టెలిఫోన్ ఎక్సే్చంజ్ సమీపంలో కేబుల్ ఫాల్ట్ వల్ల రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతకు తోడు విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరగడంతో ఒత్తిడి తట్టుకోలేక ఫీడర్లు తరచూ ట్రిప్పవుతున్నాయి. ఫలితంగా ఆయా ఫీడర్ల పరిధిలోని కాలనీలు అర్థరాత్రి అంధకారంలో మగ్గాల్సి వస్తుంది. అసలే ఉక్కపోత..ఆపై ఇంట్లో ఫ్యాన్లు కూడా తిరుగక పోవడంతో దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
గ్రేటర్‌లో విద్యుత్ వినియోగదారుల సంఖ్య ఇలా
2006 24.12 లక్షలు
2010 29.75 లక్షలు
2013 34 లక్షలు
2015 38 లక్షలు
2016 40 లక్షలు
2018 51 లక్షలు
విద్యుత్ డిమాండ్ ఇలా....
2006లో 1538 మెగావాట్లు
2010లో 1881
2013లో 2000
21015 2300
2017 2600
2018 2900
Comments
Please login to add a commentAdd a comment