‘అరుణ’ పతాకం ఎగిరేనా!
- ‘కామన్‌వెల్త్’లో నేడు హైదరాబాదీ విన్యాసాలు
- పతకం వస్తుందన్న ఆశలో అభిమానులు
సాక్షి, సిటీబ్యూరో: కామన్‌వెల్త్ గేమ్స్‌లో హైదరాబాదీ అరుణారెడ్డి మంగళవారం తన విన్యాసాలు ప్రదర్శించనున్నారు. యూసుఫ్‌గూడలోని సెయింట్‌మేరీస్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న అరుణారెడ్డి మనదేశం తరఫున ఆర్టిస్టిక్స్, జిమ్నాస్టిక్స్ విభాగంలో విన్యాసాలను ప్రదర్శించేందుకు వెళ్లిన ఐదుగురు సభ్యుల్లో ఒకరు. దక్షిణ భారతదేశం నుంచి ఆమె ఒక్కరే ఈ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాజేంద్రనగర్‌లో నివాసం ఉండే అరుణ గతంలో వరల్డ్ స్కూల్ గేమ్స్(దోహ), జూనియర్ ఏషియన్ చాంపియన్‌షిప్(జపాన్)లలో అద్భుత ప్రతిభ కనబరిచారు.
భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటలకు గ్లాస్గోలోని ఎస్‌ఎస్‌ఈ హైడ్రోలో జరిగే ఈవెంట్ లో అరుణ భారతదేశం తరఫున ఫోర్స్ ఈవెంట్, అన్‌ఈవెన్‌బార్స్, బ్యాలెన్సింగ్‌భీం, వాల్ట్ విభాగాల్లో పోటీ పడనుంది. కామన్‌వెల్త్ గేమ్స్ కోసం జనవరి నుంచి ఢిల్లీలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న అరుణ ఈసారి తప్పకుండా పతకంతో తిరిగి వస్తుందని ఆమె సన్నిహితులు, బంధువులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.