
వన్నె తగ్గిన పసుపు
క్వింటాల్‌కు రూ.3వేలు తగ్గిన ధర
- గతేడాది రూ. 9 వేల దగ్గరలో..
- ఇప్పుడు రూ. 5 వేల వరకే..
- పెరిగిన కూలి రేట్లు, పెట్టుబడి ఖర్చులు
- పెట్టుబడులూ గిట్టవంటున్న రైతులు
సాక్షి, మహబూబాబాద్: రైతులకు పసుపు పంట కూడా నిరాశే మిగిల్చింది. కనీసం పెట్టు బడి చేతికి అందివచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. గత ఏడాది క్వింటాల్ పసుపునకు రూ.9 వేలు పల కగా.. ప్రస్తుతం రూ.5 వేల నుంచి రూ.6 వేలు మాత్రమే ధర పలుకుతోంది. సోమవారం జిల్లాలోని కేసముద్రం మార్కెట్ పసుపు కాడిరకం గరిష్టంగా రూ. 5,300, కనిష్టం రూ. 4,217 పలికింది. గోళ రకం గరిష్టంగా రూ. 4,900, కనిష్టంగా రూ. 4,170 పలికింది. రాష్ట్రంలో నిజామామాబాద్ తర్వాత మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మార్కెట్‌లో పసుపు క్రయ, విక్రయాలు అధికంగా జరుగుతాయి.
రాష్ట్రంలోనే సాగు విస్తీర్ణంలో కూడా మహబూబాబాద్ జిల్లా మూడోస్థానంలో నిలుస్తోంది. ఆదాయం మాట ఏమో గానీ పెట్టుబడులు నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 9,390 హెక్టార్లలో పసుపును సాగు చేశారు. గతంలో ఎకరా విస్తీర్ణంలో సాగు చేయడానికి రూ.50వేల వరకు ఖర్చు కాగా, పెరిగిన పెట్టు బడులు, కూలీల రేట్లతో ఇప్పుడు రూ.లక్ష వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. సాధార ణంగా ఎకరం విస్తీర్ణంలో 20 క్వింటాళ్ల ఎండిన పసుపు దిగుబడి వస్తుంది. ఈ సారి మాత్రం దాదాపు అందరికీ 15 క్వింటాళ్ల దిగుబడే అందుతోంది. దీన్ని మార్కెట్‌లో విక్రయిస్తే రూ. 90వేలు సైతం రావడం లేదు.
పెరిగిన కూలి రేట్లు....
మార్కెట్‌లో పడిపోయిన ధరకు తోడు కూలి రేట్లు అమాంతంగా పెరిగిపోయాయి. గత ఏడాది మహిళ కూలీకి రూ.100 ఉండగా, ఈ సారి రూ.250కి పెరిగింది. ఎకరం పంటను తీయడానికి 60 మంది కూలీలకు రూ.15,000 వరకు చెల్లిస్తున్నారు. మార్కెట్‌లో కూలి రేట్లు పెంచాలని నెల రోజులుగా ఇక్కడి కూలీలు సమ్మె చేస్తున్నారు. అయితే, మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కూలీలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో నెల రోజుల తర్వాత సోమవారం మార్కెట్ ప్రారంభమైంది.
శ్రమ అంతా వృథా అయింది
పసుపుకు మార్కెట్‌లో ధర బాగా వస్తుందని పండించాను. విత్తనాల ఖర్చు కాకుండానే రూ.30 వేల పెట్టుబడి పెట్టాను. ఏడు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్‌కు వచ్చే సరికి క్వింటాల్‌కు రూ. 4,981, గోల రకానికి రూ. 4,500 ధర పలికింది. పెట్టుబడి కూడా రాలేదు. శ్రమ అంతా వృథా అయింది.
–బొడ్డుపెల్లి శ్రీను, నెక్కొండ, వరంగల్ రూరల్ జిల్లా
ఎకరం పసుపు సాగుకు పెట్టుబడి వివరాలు
► విత్తనం(8 క్వింటాళ్లు) రూ.32,000
► దుక్కి దున్నేందుకు రూ.3,000
► సేంద్రియ ఎరువుకు రూ.10,000
► విత్తనం వేసేందుకు(12మంది కూలీలకు) రూ.3,000
► విత్తనం వేయడానికి నాగలి కూలికి రూ.800
► విత్తనం వేసేముందు దుక్కి దున్నేందుకు రూ.1,500
► కలుపు మందుకు రూ. 300
► గుంటక దున్నేందుకు(5 సార్లకు) రూ. 3,500
► మూడు సార్లు కలుపు తీతకు కూలీలకు రూ. 9,000
► ఎరువులు(యూరియా, పొటాష్) రూ. 5,400
► పురుగు మందులకు రూ.1,500
► గుళికలు(దుంపకుళ్లు నివారణకు),ఫంగిసైట్స్ రూ. 3,000
► పసుపు దున్నడానికి నాగలి కూలి రూ. 6,000
► భూమి నుంచి పసుపు తీసేందుకు (60 మంది కూలీలకు) రూ.1,5000
► ఉడకబెట్టడానికి ఆరుగురు కూలీలకు రెండు రోజుల పాటు రూ.7,000
► ఎండిన పసుపును పాలిష్ చేసేందుకు రూ. 2,000
► ఎకరం పసుపును పండించడానికి చేతికి అందే సరికి ఇలా మొత్తం పెట్టుబడి దాదాపు రూ. 1,03,000