అవకతవకలకు తావు లేకుండా పేదల ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించేందుకు కృషి చేయనున్నట్లు పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగా.. అవకతవకలకు తావు లేకుండా పేదల ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించేందుకు కృషి చేయనున్నట్లు పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గురువారం రెవెన్యూ శాఖ బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ దశాబ్దాలుగా అధికారికంగా రిజిస్ట్రేషన్లు లేక 125 గజాలలోపు ఇళ్లలో నివసిస్తున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఉన్నారని, వారంతా సీఎం తాజాగా తీసుకున్న నిర్ణయంతో సంతోషంగా ఉన్నారన్నారు.
ఈ విధానంతో ఇళ్లు అమ్ముకోవాలనుకున్నా, కూల్చివేసి కొత్తగా నిర్మాణాలు చేసుకోవాలన్నా ఇకపై ఇబ్బంది ఉండదని చెప్పారు. అన్యాక్రాంతమైన విలువైన భూములను కాపాడడం, దళితులకు భూ పంపిణీ సక్రమంగా జరిగేలా చూడడం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సారథ్యంలో ఆయనతో కలసి రెవెన్యూ విభాగాన్ని పటిష్టం చేయనున్నట్లు వివరించారు.