మున్సిపాలిటీ లీజు షాపుల అద్దెపై ప్రతిష్టంభన
అద్దె బకాయిలు రూ. 4 కోట్లు
పట్టించుకోని మున్సిపాలిటీ
నల్లగొండ: నీలగిరి మున్సిపాలిటీ కార్యాలయానికి చెందిన షాపుల అద్దె విషయం అంతుచిక్కడం లేదు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 238 షాపుల అద్దె బకాయి సుమారు రూ.3 కోట్లకు పైగా ఉన్నట్లు గతేడాది ఆడిట్ బృందం అధికారులు తేల్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో కోటి రూపాయల అద్దె బకాయిలు పెరిగినట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు. మొత్తం 4 కోట్ల రూపాయలకు పైగానే బకాయిలు ఉన్నట్లు మున్సిపల్ అధికారులే చెబుతున్నారు. ఇటీవల ఈ మున్సిపల్ షాపులకు అధికారులు వేలం నిర్వహించారు. వేలంలో పాల్గొనాలంటే అద్దె చెల్లించాలని మున్సిపల్ అధికారులు నిబంధన పెట్టడంతో కొంత మంది వ్యాపారులు బ్యాంకులలో చలానా ద్వారా చెల్లించినట్లు తెలిసింది. కేవలం కొంది మంది మాత్రమే 20 లక్షల రూపాయల వరకు బ్యాంకులలో చెల్లించినట్లు సమాచారం. కానీ ఏ వ్యాపారి ఏ బ్యాంకులో ఎంత చెల్లించారనేది తెలియకపోవడంతో లీజు షాపుల అద్దె బకాయిల లెక్కలపై ప్రతిష్టంభన నెలకొంది.
లెక్క తేలేది ఎలా ?
మున్సిపాలిటీ కార్యాలయానికి కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోవడంతో నిధుల కొరత ఏర్పడుతుంది. డబ్బులు లేవని చెబుతున్న అధికారులు తమకు రావల్సిన బకాయిలపై దృష్టి పెట్టకపోవడంతో ఎక్కడివి అక్కడే నిలిచిపోతున్నాయి. వ్యాపారులు అద్దెను నేరుగా మున్సిపల్ కార్యాలయంలో చెల్లించే ఏర్పాట్లు చేయయకపోవడమూ దీనికి కారణంగా చెప్పవచ్చు. కొంత మంది నిజాయితీ గల వ్యాపారులు అద్దె చెల్లిస్తున్నా ఎంత అనేది కనుక్కోవడం మున్సిపాలిటీ అధికారులకు సవాల్‌గా మారింది. చలానా ద్వారా బ్యాంకులలో అద్దె చెల్లించాలని గత దశాబ్దం క్రితం అప్పటి మున్సిపల్ అధికారులు చెప్పినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. కానీ 2010 నుంచి వ్యాపారులు అద్దె చెల్లించడం చాలా వరకు మానేశారు. ఇలా ప్రతి సంవత్సరం అద్దె చెల్లింపులు జరుగకపోవడంతో వ్యాపారులు ప్రస్తుతం కోట్ల రూపాయలు బాకీ పడ్డారు. మున్సిపల్ షాపుల అద్దెకు సంబంధించిన లెక్కలు గత ఐదేళ్లుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు లెక్క తేలడమే అధికారులకు తలనొప్పిగా మారింది.
వ్యాపారులు చెల్లించిన ఓచర్లు కూడా మున్సిపల్ అధికారులకు సమర్పించకపోవడంతో లెక్క దొరకని పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలో అకౌంట్, రెవెన్యూ విభాగాల సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.4 కోట్ల బకాయిలు ఉన్నా వాటిని ఎలా రాబట్టాలనే దానిపై మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. ఇరు విభాగాలను సమన్వయం చేసి, అకౌంట్ విభాగం ద్వారా బ్యాంకులలో ఐదేళ్ల నుంచి జమ చేసిన వివరాలు బయటికి తీస్తే లెక్క తేలే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో నెల రోజుల్లోనే డబ్బులు వసూలు చేసే వెసులుబాటు కలుగుతుంది. మున్సిపాలిటీలో వివిధ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇతరులకు అది కల్పతరువుగా మారిందనే చెప్పాలి. మున్సిపల్ ఉన్నతాధికారులు జో క్యం చేసుకుంటేనే బకాయిల సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.