
త్యాగాల తెలంగాణ కావాలి: గద్దర్
కొమురవెల్లి: ప్రజలకు ప్రత్యేక తెలంగాణ కాదని త్యాగాల తెలంగాణ కావాలని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని శ్రీమల్లికార్జునస్వామికి గద్దరు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో అన్ని వర్గాల ప్రజలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఎంతో ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా చెరువులు నిండాలని, పశువుల సంపద పెరగాలని, రైతులు చల్లంగా ఉండాలని మల్లన్నను మొక్కినట్లు గద్దర్ పేర్కొన్నారు.
అనంతరం ఆలయంలో మల్లన్నపై జానపద పాటలను పాడి అందరిని అలరించారు. అలాగే, ఆలయ ప్రాంగణంలో అర్చకులు, వేద విద్యార్థులతో కలసి భజనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు సెల్ఫీలు దిగారు. అంతకుముందు అర్చకులు, అధికారులు గద్దర్ దంపతులకు శాలువ కప్పి సన్మానించారు.