- బ్యాంకర్లకు కలెక్టర్ కిషన్ ఆదేశం
- అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్‌స
హన్మకొండ అర్బన్ : రాష్ట్ర స్థాయిలో జరిగిన ఒప్పందంలో భాగంగా రైతులకు సంబంధించిన రుణాలు వెంటనే రీషెడ్యూల్ చేయాలని కలెక్టర్ జి.కిషన్ బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, బ్యాంకర్లతో మంగళవారం ఆయన మాట్లాడారు.
బ్యాంకర్లు ఈ విషయంలో నిక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. ఇబ్బందులు ఉన్నట్లయితే లిఖితపూర్వకంగా ఇవ్వాలని స్పష్టంచేశారు. సమస్యలు తనదృష్టికి తీసుకువస్తే జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. సమస్యలు ఉన్నట్లయితే రెవెన్యూ సిబ్బంది సహకారం తీసుకోవాలని సూచించారు. ఆహార భద్రత కార్డులు, పింఛన్లు, ఫాస్ట్ పథకాలకు సంబంధించిన దర ఖాస్తుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని, నిబంధనలు త్వరలో వస్తాయని తెలిపారు.
ప్రజలకు రశీదు ఇవ్వాలి
దర ఖాస్తుదారులకు రశీదు తప్పనిసరిగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ సర్వే వివరాల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని తెలిపారు. త్వరలో ఇందుకు సంబంధించిన స్పష్టమైన ఉత్తర్వులు వస్తాయని తెలిపారు. వికలాంగులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మహబూబాబాద్, జనగామ, ములుగు ఏరియూ ఆస్పత్రులు, ఎంజీఎంలలో క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా కేంద్రం నుంచి డీఆర్‌డీఏ పీడీ శంకరయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.