ఖాయిలా పరిశ్రమలను పునఃప్రారంభిస్తాం
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాయిలా పడిన పరిశ్రమలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అందిస్తున్న రాయితీలనే ఖాయిలా పరిశ్రమలకూ వర్తింపజేస్తామని ప్రకటించారు.
సిర్పూర్–కాగజ్ నగర్ పేపర్ మిల్లును తిరిగి తెరిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలసి బ్యాంకర్లు, పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ సోమవారం సచివాలయంలో సమావేశమ య్యారు. పేపర్ మిల్ మూతపడడంతో రెండున్నర వేల కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే మిల్లు మూతపడిందని ఆరోపించారు. మిల్లు తిరిగి ప్రారంభించేందుకు కావాల్సిన ముడి సరుకు, మానవ వనరులు, నీళ్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని పేర్కొన్నారు.