సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్‌కు నీటిని ఎత్తిపోసేలా చేపట్టిన పునరుజ్జీవ పథకంతో.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద రెండు పంటలకు నీళ్లు అందుతాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పునరుజ్జీవ పథకాన్ని 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. సంవత్సర కాలంలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో టీఆర్‌ఎస్ సభ్యులు మనోహర్‌రెడ్డి, కె.విద్యాసాగర్‌రావు, బీజేఎల్పీనేత జి.కిషన్‌రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. ప్రభుత్వం పునరుజ్జీవ పథకానికి రూ.1,067 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చిందని, వరద కాల్వ ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీకి తరలిస్తామని చెప్పారు. దీనికితోడు ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు సైతం నీళ్లిచ్చేలా కాల్వల ఆధునీకరణ చేపట్టామన్నారు.
ప్రజలపై భారం పడుతుందనే..
రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ల విలువ పెంచితే 99 శాతం ప్రజలపై తీరని భారం పడుతుందని.. అందువల్లే పెంచడం లేదని హరీశ్‌రావు తెలిపారు. రిజిస్ట్రేషన్ విలువ పెంచకపోవడంతో ప్రాజెక్టుల కింద భూమిని కోల్పోతున్న నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్ సభ్యుడు టి.జీవన్‌రెడ్డి సభ దృష్టికి తేగా.. హరీశ్ సమాధానమిచ్చారు. కాంగ్రెస్ హయాంలో భూసేకరణకు రూ.60 వేల నుంచి రూ.2 లక్షలకు మించి పరిహారం చెల్లించలేదని.. తాము ప్రస్తుతం రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం చెల్లిస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ విలువ రూ.60 వేల వరకే ఉన్న చోట మూడింతల పరిహారం లెక్కన రూ.1.80 లక్షలు మాత్రమే వస్తాయని.. కానీ తమ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వారికి సైతం రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల పరిహారం అందిస్తోందని పేర్కొన్నారు. ఇక మూసీ ప్రాజెక్టు ఆధునీకరణ కోసం రూ.65.56 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేశామని మరో ప్రశ్నకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. ఈ పనులను 18 నెలల్లో పూర్తిచేసి, చివరి ఆయకట్టు వరకు నీరిందిస్తామన్నారు.
ప్రభుత్వాస్పత్రులపై విమర్శలొద్దు: కేసీఆర్
ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితులపై వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయొద్దని కేసీఆర్ పేర్కొన్నారు. పడకల సంఖ్యకు మించి రోగులు వస్తున్నారని, వైద్యులు మానవతా దృక్పథంతో వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్‌ఎస్ సభ్యుడు జలగం వెంకటరావు అడిగిన ప్రశ్నపై సీఎం స్పందించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల భయంకరమైన స్థితిలో కూరుకుపోయిన వైద్యారోగ్య శాఖకు తాము జీవం పోస్తున్నామన్నారు. ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న వైద్య రంగాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, విమర్శలు చేయడం సరికాదని సూచించారు. ఇటీవల తాను ఓ పత్రికలో ఒక వార్తను చూశానని.. ఓ ప్రభుత్వాస్పత్రిలో బెడ్లు లేవని, కిటికీకి సెలైన్ బాటిల్ కట్టి చికిత్స అందిస్తున్నారని ఫొటోతో సహా ఓ కథనాన్ని ప్రచురించారని చెప్పారు. దానిపై తాను వైద్యారోగ్య మంత్రి, ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడితే.. అసలు విషయం తెలిసిందన్నారు. ప్రతి ఆస్పత్రిలో నిర్ణీత సంఖ్యలో పడకలు ఉంటాయని, అంతకు మించి రోగులు రావడంతో వైద్యులు, సిబ్బంది అలా చేయాల్సి వచ్చినట్లుగా వెల్లడైందని చెప్పారు. అందరికీ వైద్యం అందించాలన్న సదుద్దేశం, మానవతా దృక్పథంతో వైద్యులు వ్యవహరిస్తే.. విమర్శిస్తూ కథనాలు ప్రచురించడం సరికాదన్నారు. తర్వాత తాను సదరు పత్రిక యాజమాన్యానికి ఫోన్ చేశానన్నారు. విషయం తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు రాయొద్దని.. వైద్యులను ప్రోత్సహించాలని సూచించినట్లు తెలిపారు. రోగుల సంఖ్య పెరిగినా చిత్తశుద్ధితో వైద్యం అందిస్తున్న ప్రభుత్వ వైద్యులను అభినందిస్తున్నానన్నారు.
సమయ పాలనపై వద్దా?
శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయపాలన అంశంపై బుధవారం అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రశ్నోత్తరాల్లో ఎక్కువ సమయం తీసుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, జీవన్‌రెడ్డిలను సభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు తప్పుబట్టారు. వారు 15 నిమిషాలకు పైగా సమయం తీసుకుని.. సంబంధం లేకుండా ప్రశ్నలు వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకే మంత్రికి 30 నిమిషాల సమయం పడుతుందన్నారు. అయినా కాంగ్రెస్ సభ్యులు బయటకు వెళ్లి అధికారపక్షం తమకు సమయం ఇవ్వడం లేదంటోందని విమర్శించారు. ప్రశ్న సూటిగా వేస్తే మంత్రి క్లుప్తంగా సమాధానం ఇస్తారన్నారు. ఖమ్మం జిల్లాలో బోదకాలు వ్యాధిపై మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడితే.. మీరేమో జహీరాబాద్, జగిత్యాల జిల్లాల్లో ప్రబలిన వ్యాధులను ప్రస్తావిస్తున్నారని, ఇది సరికాదని పేర్కొన్నారు. దీంతో హరీశ్‌రావు తీరును కాంగ్రెస్ సభ్యులు తప్పుబట్టడంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం కూడా పలువురు సభ్యులు ఇదే తీరులో ప్రశ్నలు సంధిస్తుండటంతో స్పీకర్ వారి మైక్ కట్ చేశారు.
బోదకాలు బాధితులకు పింఛన్లు: లక్ష్మారెడ్డి
రాష్ట్రంలో బోదకాలు (పైలేరియా)ను శాశ్వతంగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఆ వ్యాధి లక్షణాలున్న వారికి, వ్యాధి సోకిన వారికి మందులు అందజేస్తున్నామన్నారు. బోదకాలు సోకి అంగవైకల్యం వచ్చిన వారికి పింఛన్లు ఇవ్వాలని శాసనసభ్యులు కోరిన నేపథ్యంలో.. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు, పైలేరియాను పూర్తిగా అరికట్టామని తెలిపారు.
ఏడాదిలోగానే ‘పునరుజ్జీవం’!
Published Thu, Nov 9 2017 3:16 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment