సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్వహణ వ్యయంపై కొందరు చేస్తున్న ప్రచారం అర్థరహితమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఏ మాత్రం పరిజ్ఞానం లేని, సగం పరిజ్ఞానం ఉన్న వ్యక్తులే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ కోసం ఏటా రూ.10 వేల కోట్ల విద్యుత్ బిల్లులను చెల్లించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులను కాపాడుకోవడానికి అవసరమైతే రూ.12 వేల కోట్లు.. రూ.15 వేల కోట్లు కూడా చెల్లిస్తామన్నారు. రైతులు ధనిక రైతులయ్యే వరకు ఉచితంగా కరెంట్, ఎత్తిపోతల నీరిస్తామని చెప్పారు. రైతుల అప్పులన్నీ తీరిపోయే వరకు అండగా ఉంటామన్నారు.
రుణ విముక్తుల్ని చేసేందుకే..
రాష్ట్ర రుణ విముక్తి కమిషన్ చట్ట సవరణ ఆర్డినెన్స్ బిల్లును గురువారం అసెంబీల్లో ప్రవేశపెట్టిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. చిన్న, సన్నకారు రైతు లు, వృత్తిపరులకు బ్యాంకుల నుంచి 42 శాతమే రుణాలందిస్తున్నారని, దీంతో వడ్డీ వ్యాపారుల నుం చి అప్పులు తీసుకోవాల్సి వస్తోందన్నారు. అధిక వడ్డీలు వసూలు చేసి పీడిస్తున్నారని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం రుణ విమోచన కమిషన్ చట్టం తెచ్చిందన్నారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జిని కమిషనర్‌గా నియమించాలని చట్టంలో నిబంధన ఉందని, అయితే గ్రామీణ నేపథ్యం ఉన్న సీనియర్ రైతు లేదా వ్యవసాయరంగ నిపుణుడిని నియమిస్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో తాము ఈ ఆర్డినెన్స్ తెచ్చామన్నారు. రిటైర్డ్ జడ్జిని కమిషనర్‌గా నియమిస్తేనే నిష్పక్షపాతంగా వ్యవహరించే అవకాశముంటుందని కాంగ్రెస్, ఎంఐఎం పక్షనేతలు భట్టి విక్రమార్క, అక్బరుద్దీన్ ఒవైసీలు ప్రభుత్వానికి సూచిస్తూనే మద్దతు తెలపడంతో బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందింది. రైతు బంధు పథకం ద్వారా రైతులకు ఎకరాకు రూ.5 వేల ఆర్థిక సహాయం అందించడం ద్వారా సీఎం కేసీఆర్ కొత్త ఒరవడి సృష్టించారని అక్బరుద్దీన్ కొనియాడారు. అయినా రైతుల సమస్యలు తీరలేదని, ఇంకా రాష్ట్రంలో అక్కడక్కడా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించినందుకు సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment