రేవంత్ రెడ్డి, సోయం బాపూరావు బోడ జనార్దన్ రావి శ్రీనివాస్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరు హీరో అవుతారో.. ఎప్పుడు జీరోగా మా రుతారో ఎవరికీ తెలియదు. ఆ పార్టీలో తలలు పండిన నాయకులే ఎన్నికల సమయంలో సీటు సాధించడానికి నానా తంటాలు పడుతుంటారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి అనుభవమైతే తప్ప ఈ సత్యం బోధ పడదు. తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కీలకపాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరిన ఉమ్మడి జిల్లా నేతల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. రేవంత్‌రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లా నుంచి మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు, సిర్పూరు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రావి శ్రీనివాస్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
వీరందరిని రాహుల్‌గాంధీ స్వయంగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అప్పటి నుంచి రేవంత్ గ్రూపుగా ఆయా నియోజకవర్గాల్లో టికెట్టు తమకేననే ధీమాతో ఉన్న నేతలకు ముందస్తు ఎన్నికల సమయంలో అసలు విషయం అర్థమవుతోంది. సీనియారిటీతోపాటు ప్రజాబలం, ప్రత్యర్థిని ఎదుర్కొనే శక్తి, ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ తదితర అంశాలు కూడా కాంగ్రెస్ టికెట్టు సాధించేందుకు అర్హతగా ఉంటాయని తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో బలమైన పోటీ నెలకొనడంతో ఆలస్యంగా తేరుకొన్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ టికెట్లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండడంతో రేవంత్ బ్యాచ్‌కు సీట్లెన్ని వస్తాయనే అంశం చర్చనీయాంశంగా మారింది. బోథ్ నుంచి సోయం బాపూరావు పట్ల కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఒకవేళ బాపూరావు సీటు తెచ్చుకున్నా, ఆదివాసీ ఉద్యమ నాయకుడిగా చేసిన ప్రయత్నమే తప్ప రేవంత్ పేరు మీద కాదనేది సుస్పష్టం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తొలిజాబితా విడుదల కోసం నేతలు ఎదురు చూస్తున్నారు.
బోడ జనార్దన్‌కు ఢిల్లీ లాబీయింగ్‌తో బోర్లకుంట చెక్?
మాజీ మంత్రి బోడ జనార్దన్ సంవత్సరం క్రితం వరకు టీడీపీలో క్రియాశీలకంగానే ఉన్నారు. మంచిర్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూడా ఆయనే. ఎన్టీరామారావు హయాంలో 1985లో టీడీపీ నుంచి తొలిసారిగా గెలిచిన ఆయన వరుసగా నాలుగు పర్యాయాలు తన విజయయాత్ర కొనసాగించారు. 2004లో తొలిసారి మాజీ మంత్రి జి.వినోద్ చేతిలో పరాజయం పాలైన తరువాత మళ్లీ తెరపైకి రాలేకపోయారు. 2009, 2010లలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసినా కనీసం రెండో స్థానానికి కూడా చేరుకోలేదు. 2010 ఉప ఎన్నికల అనంతరం పార్టీలు మారే పనిలో పడ్డ ఆయన 2014లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినప్పటికీ సీటు రాకపోవడంతో ఎన్నికల తరువాత తిరిగి టీడీపీలో చేరారు. ఏడాది క్రితం రేవంత్‌రెడ్డిని నమ్ముకొని కాంగ్రెస్‌లో చేరారు.
2004 నుంచి గెలుపునకు దూరమైన బోడ జనార్దన్ ఈసారి కాంగ్రెస్ సీటు కోసం రేవంత్ ద్వారా తీవ్రంగానే ప్రయత్నించారు. చివరి అవకాశంగా తనకు సీటిస్తే గెలుస్తానని చెప్పారు. అదే సమయంలో ఇక్కడ మరో ముగ్గురు నేతలు సీటును ఆశించారు. చివరికి గ్రూప్–1 ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన బోర్లకుంట వెంకటేష్ నేత అనే నాయకుడి నుంచి పోటీ ఎదురైంది. ఢిల్లీలో రాహుల్‌గాంధీకి సన్నిహితుడైన కొప్పుల రాజు అండతో వెంకటేష్ నేత సీటు ఖాయమైనట్లు ఇప్పటికే నియోజకవర్గంలో తెలిసిపోయింది. ఈ మేరకు వెంకటేష్ నేత కాంగ్రెస్ అభ్యర్థి గానే గ్రామాల్లో ప్రచారం జరుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో బోడ జనార్దన్ టీడీపీలో ఉంటే కూటమి పొత్తులో భాగంగా అవకాశం దక్కేదేమోనని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.
మాజీ మంత్రిగా, నాలుగుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా టీడీపీ చెన్నూరును కోరేదేమో..?
రావి శ్రీనివాస్ ఆశలపై హరీష్‌బాబు నీళ్లు గత ఎన్నికల్లో సిర్పూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేంసాగర్‌రావు మంచిర్యాల సీటుపై కన్నేయడంతో నాయకత్వ లోటు ఏర్పడింది. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డితోపాటు రావి శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరి టికెట్టు తనకేనన్న ధీమాతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో దివంగత ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంరావు తనయుడు పాల్వాయి హరీష్‌బాబు కాంగ్రెస్ పార్టీలో చేరి రావి శ్రీనివాస్‌కు పోటీగా తయారయ్యారు.
ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని గత కొంతకాలంగా సిర్పూరులో ప్రచారం చేసుకుంటున్న రావి శ్రీనివాస్‌ను ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేర్పించారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది. పాల్వాయి తనయుడిగా, యువకుడైన డాక్టర్‌గా హరీష్‌బాబు అనతికాలంలోనే గ్రామాల్లో చొచ్చుకుపోవడం ఆయనకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఇక రావి శ్రీనివాస్ తాజా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు సన్నిహిత బంధువు కావడం, సెటిలర్‌గా ఉన్న గుర్తింపు ప్రతిబంధకంగా మారాయి. ఈ పరిస్థితుల్లో రేవంత్‌రెడ్డి టీంగా టికెట్టు లభిస్తుందో లేదో చూడాలి.
ఆదివాసీ ఉద్యమంపైనే బాపూరావు ఆశ
బోథ్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు టీడీపీ నుంచి రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌లో చేరినప్పటికీ, ఆయన ఆదివాసీ ఉద్యమంపైనే ఆశ పెట్టుకొని పార్టీ టికెట్టు ఆశిస్తుండడం గమనార్హం. గత సంవత్సరం చివర నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో బలంగా ఎగిసిపడ్డ ఆదివాసీల ఉద్యమానికి బాపూరావు నాయకత్వం వహించారు. తుడుందెబ్బ అధ్యక్షుడిగా ఆదివాసీ తెగల వాణిని హైదరాబాద్‌లో కూడా వినిపించారు. ఆదివాసీ ఉద్యమ తీవ్రతకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కూడా బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో బోథ్‌లో లంబాడ వర్గానికన్నా, ఆదివాసీల ప్రాబల్యమే ఎక్కువ కావడంతో తనకు టికెట్టు ఖాయమనే ధీమాతో ఉన్నారు.
ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపూరావు లంబాడ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, ఎంపీ నగేష్ నుంచి బాపూరావుకు మద్ధతు దొరకకపోవడంతో తనకు సీటిస్తే గెలుపు ఖాయమని చెపుతున్నారు. అయితే ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అనిల్ జాదవ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. లంబాడ వర్గానికి చెందినప్పటికీ, డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి ద్వారాఉత్తమ్ కుమార్‌రెడ్డి వర్గం నుంచి సంపూర్ణ మద్ధతు ఆయనకుంది. ఓడిపోయినా, పార్టీని అంటిపెట్టుకొని ఉన్న తనను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వ్యక్తికి ఎలా టికెట్టు ఇస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. తానే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఆయన చెపుతున్నారు. ఏంజరుగనుందో దీపావళి వరకు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment