కోటి ఎకరాల్లో పంటను ఎలా కొంటారు!
కేసీఆర్‌ను ప్రశ్నించిన రేవంత్
సాక్షి, ఖమ్మం: ‘ఎవరు అడ్డమొచ్చినా సరే కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని ప్రతిసారి సీఎం కేసీఆర్ చెబుతున్నారు. కోటి ఎకరా లకు నీళ్లు ఇవ్వండయ్యా.. అయితే, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 2.5లక్షల ఎకరాల్లో మిర్చి పండించారు. ఈ మిర్చి దాదాపు 60 లక్షల క్వింటాళ్లు వచ్చింది. 2.50 లక్షల ఎకరాల్లో పండించిన పంటకే గిట్టుబాటు ధర ఇవ్వలేని నువ్వు.. కోటి ఎకరాల్లో పంట పండిస్తే కొనేది ఎక్కడ.. పెట్టేది ఎక్కడ.. ధర ఎలా ఇస్తావు’ అని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మిర్చి రైతులకు మద్దతుగా టీటీడీపీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేం ద్రంలో శనివారం రేవంత్‌రెడ్డి ఒకరోజు దీక్ష నిర్వహించారు.
ఈ దీక్షలో జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన మిర్చి రైతులు కూడా పాల్గొన్నారు. రేవంత్ మాట్లాడుతూ ఖమ్మం మార్కెట్‌పై దాడి చేసింది రైతులు కారని, రౌడీలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్‌రావు అన్నారని, నిజమే అని నమ్మిన పోలీసులు వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి.. చేతులకు బేడీలు వేశారన్నారు. ఈ సంఘటనపై తెలంగాణ సమాజం అంతా భగ్గుమంటే.. తుమ్మల, కేసీఆర్‌లు చివరికి ఇద్దరు అధికా రులను బలి ఇచ్చారన్నారు. కేటీఆర్ ఐస్‌క్రీమ్ అమ్మితే రూ.5.50 లక్షలు, హరీశ్‌రావు బస్తాలు మోస్తే రూ.6 లక్షలు, కవితమ్మ అరగంట చీరలు అమ్మితే రూ.10లక్షలు వస్తాయని, ఇలాంటి అద్భుతాలు చేసే మీరు ఖమ్మం మార్కెట్ యార్డులో క్వింటాల్ మిర్చి రూ.10వేలకు ఎందుకు అమ్మించలేకపోతున్నారని విమ ర్శించారు.
ఎన్నో పోరాటాలతో సాధించు కున్న తెలంగాణ రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు. కానీ, రుద్రమదేవి సినిమాకి రాయితీ కల్పించా రని, శాతకర్ణి సినిమాకు సేల్స్‌ట్యాక్స్ తగ్గించడం, బాహుబలి సినిమా టికెట్లు ఇష్టం వచ్చినట్లు పెంచుకోమని జీవో ఇచ్చారని.. కొడుకు కేటీఆర్ కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ‘నీ కూతురు బతుకమ్మ ఆడుకోవడానికి ఏటా రూ.10 కోట్లు, కొడుకు ముఖ్యమంత్రి కాడని జ్యోతిష్యులు చెప్పారని, వాస్తు దోషం ఉందని కొత్త సచివాలయానికి రూ.2 వేల కోట్లు, నువ్వు విలాసవంతంగా ఉండటానికి కొత్త గడికి రూ.1,000 కోట్లు నిధులు ఉంటాయి కానీ.. రైతులకు రూ.500కోట్లు ఇవ్వడానికి కేంద్రం కావాలా’ అని ధ్వజమెత్తారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడు తూ ఖమ్మం మార్కెట్‌లో ఈ–నామ్‌పై దళారులు రైతుల ముసుగులో దాడి చేశారని, దీనిపై కలెక్టర్, జేసీ ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. రేవంత్ సాయంత్రం దీక్ష విరమించారు. దీక్షకు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, రాజకీయ జేఏసీ సంఘీభావం ప్రకటించాయి.