
టీఆర్‌ఎస్‌లో చేరనందుకే నాపై వివక్ష: రేవంత్
అసెంబ్లీలో తాను లేవనెత్తిన అంశాలపై ఏ విచారణకైనా సిద్ధమని టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి అన్నారు.
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో తాను లేవనెత్తిన అంశాలపై ఏ విచారణకైనా సిద్ధమని టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి అన్నారు. సభలో తాను ప్రస్తావించిన విషయాలపై విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌లోకి రావాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించారని, దాన్ని తిరస్కరించినందుకే తనను హింసిస్తున్నారని ఆరోపించారు. తనకు ఎవరితోనో సంబంధాలున్నాయని అమ్మాయిలతో ఫోన్‌చేసి తిట్టిస్తున్నారని, పైగా తన ఫోన్‌లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తారాచౌదరి వ్యవహారంలో తన ప్రమేయాన్ని బయటపెట్టాలని సవాల్ విసిరారు. సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా నిజామాబాద్ కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు, హైదరాబాద్ లో సమాచార శాఖ తీసిన వీడియో క్లిప్పింగులు, ఇతర దృశ్యాలను మీడియాకు ప్రదర్శించారు. ఉరిశిక్ష పడిన వారికి కూడా తమ వాదనను వినిపించే అవకాశం ఉంటుందని, తన విషయం లో వివక్ష చూపడం భావ్యంగా లేదన్నారు.