
శిథిలమైన ముసలంపల్లి
ఆ మూడు గ్రామాలు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయాయి. అయితే రికార్డుల్లో మా త్రం పదిలంగా ఉన్నాయి.
ఆ ఊళ్లు ఏనాడో ఖాళీ
• దెయ్యం దెబ్బకు, రోగాలకాటుతో పొరుగూళ్లకు..
• లేనివి ఉన్నట్లు రెవెన్యూశాఖ ఉత్తర్వులు
• జోగుళాంబ గద్వాల జిల్లాలో వింత పరిస్థితి
గట్టు: ఆ మూడు గ్రామాలు ఎప్పుడో కాలగర్భం లో కలిసిపోయాయి. అయితే రికార్డుల్లో మా త్రం పదిలంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆ గ్రామాలు ఉన్నట్లు రికార్డుల్లో చూపడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది. గట్టు మండలంలో ఒకప్పుడు ఉన్న ముసలంపల్లి, అప్పకొండనహళ్లి, ఈసర్లపాడు కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని గ్రామాలు. ప్రస్తుతం ఆ ప్రాంతానికి వెళ్లి చూస్తే శిథిలాలు తప్ప మరేమీ కనిపించవు. జనసంచారం లేని గ్రామాలుగా రికార్డులకెక్కాయి. మరి ఆ గ్రామాల్లోని జనాభా ఎటు వెళ్లారు... ఏమైపో యారు! అని ప్రశ్నిస్తే ఒక్కో గ్రామానికి ఒక్కో దీనగాథ ప్రచారంలో ఉంది. మూఢ నమ్మకం, ప్రజల అమాయకత్వం, అంటురోగాలు ఆ మూడు గ్రామాలను జనసంచారం లేని గ్రామాలుగా మార్చేశాయని చెబుతున్నారు.
ఈసర్లపాడుకు అంతుచిక్కని రోగం
నందిన్నె–కాలూర్ తిమ్మన్‌దొడ్డి గ్రామాల మధ్య ఈసర్లపాడు ఉంది. ఇక్కడ సుమారు 500 మంది జనాభా నివసించేవారట. పాడిపంటలకు ప్రసిద్ధి చెందిన ఈ గ్రామం పరిసర ప్రాంతాల్లో సంపన్న గ్రామం. అయితే ఇక్కడా అప్పట్లో అంతుచిక్కని రోగాలు ప్రబలి, వైద్యసేవలు అందక గ్రామస్తులు చాలామంది మృత్యువాతపడడంతో ఒక్కొక్కరుగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఊరును ఖాళీ చేసి నందిన్నెలో కొందరు, కాలూర్‌తిమ్మన్‌దొడ్డిలో మరికొందరు స్థిరపడ్డారు. ఇక్కడ జనవాసానికి సంబంధించిన ఆనవాళ్లు పూర్తిగా శిథిలమయ్యాయి.
ప్రభుత్వ తాజా ఉత్తర్వులు
జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వం కొన్నిమార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అప్పకొండనహళ్లి గ్రామాన్ని కేటీదొడ్డి (కాలూ రు తిమ్మన్‌దొడ్డి) మండలంలో, ముస్లింపల్లెను గట్టు మండలంలోకి, శాలిపూర్, ఖానాపూర్ గ్రామాలను ఉండవెల్లి మండలంలోకి, మంగంపేట, రాయిమాకులకుంట్ల, పోసలపాడు గ్రామాలను మానవపాడు మండలంలోకి మార్చుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ పేర్కొం ది. ఈ గ్రామాలు భౌతికంగా ఎక్కడాలేవు.
దెయ్యం దెబ్బకు ముసలంపల్లి ఖాళీ!
బల్గెర గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో తెలంగాణ–కర్ణాటక సరిహద్దు లో ముసలంపల్లి గ్రామం ఉండేది. ఇప్పటికీ అక్కడ శిథిలావస్థలో ఆంజనేయస్వామి దేవాలయం అలాగే ఉంది. సుమారు 150 ఏళ్ల క్రితం ఇక్కడ 600 మంది జనాభా నివసించేవారట. అప్పట్లో ఓ నిండు గర్భిణిని భర్త అనుమానించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుని గ్రామంలోని వారిని దెయ్యం రూపంలో వెంటాడినట్లుగా కథ ప్రచారం ఉంది.
ఇలా దెయ్యంగా మారిన ఆమె అంతు చిక్కని రోగాలతో ఆ గ్రామస్తులను హత మార్చుతుండేదని∙శతాధిక వృద్ధులు చెబుతుంటారు. అప్పట్లో రోగాలు గ్రామంలో ప్రబలడంతో చాలామంది మృత్యువాత పడగా, మిగిలిన వారు గ్రామం వదిలి ఇతర ప్రాంతాల్లో స్థిరపడినట్లుగా చెబుతున్నారు. అలా దెయ్యం దెబ్బతో పాటు అంటు రోగాల కారణంగా ఈ గ్రామం జన సంచారం లేని గ్రామంగా మారిపోయింది. ఈ గ్రామానికి చెందిన వారి వారసులు ఇప్పటికీ బల్గెర, చమన్‌ఖాన్‌దొడ్డి గ్రామాలతో పాటు కర్ణాటకలోని జిలంగేరి గ్రామంలో స్థిరపడ్డారు. వారు ఈ గ్రామశివారులోని పొలాలను ఇప్పటీకి సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
అప్పకొండనహళ్లిని వదిలేశారు..
మాచర్ల– చింతలకుంట గ్రామాల మధ్య అప్పకొండనహళ్లి ఉంది. ఈ గ్రామంలోనూ సుమారు అప్పట్లోనే 450 మంది దాకా జనాభా ఉండేవారని చెబుతున్నారు. ఒకానొక సందర్భంలో గ్రామంలో భయం కరమైన రోగాలు ప్రబలడంతో మరణించే వారిసంఖ్య రోజు రోజుకు పెరగడంతో మిగతావారు గ్రామం వదలి వెళ్లిపోయారు. మాచర్లలో కొందరు, చింతలకుంటలో మరికొందరు స్థిరపడ్డారు. ఇక్కడ ఆంజనేయస్వామి దేవాలయం, పురాతనకాలం నాటి కోట బురుజు ఇప్పటికీ శిథిలమై కనిపిస్తాయి.