
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం సమీక్ష నిర్వహిం చారు. స్పీకర్ చాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ స్పీకర్ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్‌కు సంబంధించిన పలు అంశాలతోపాటు, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా అధికారులు సమాచారం సిద్ధం చేసుకోవాలని స్పీకర్ సూచించారు. మీడియా ప్రతినిధులకు పాస్‌ల జారీ, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపైనా స్పీకర్ సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ ఆవరణతో పాటు పరిసరాల్లో చేపట్టిన బందోబస్తు వివరాలను పోలీసు అధికారులు స్పీకర్‌కు వివరించారు. సమావేశంలో శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులుతో పాటు, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన శాసనసభ చీఫ్ మార్షల్ టి.కరుణాకర్‌ను స్పీకర్ ఈ సందర్భంగా అభినందించారు.
మండలిలో బడ్జెట్ ప్రతిపాదన..
ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను చూస్తున్న సీఎం కేసీఆర్.. శాసనసభలో స్వయంగా 2019–20 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని సిద్ధం చేయగా, బడ్జెట్ సమావేశం ప్రారంభమయ్యేలోగా మంత్రిమండలి ఆమోదం పొందాల్సి ఉంది. ఇదిలా ఉంటే శాసనమండలిలో బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెడతారనే అంశంపై గోప్యత కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రతిపాదించగా, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ శాననమండలిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం జరిగే సమావేశాల్లో శాసనమండలిలో ఈటల రాజేందర్ మరోమారు బడ్జెట్‌ను ప్రవేశపెడతారా లేక ఇతరులకు అవకాశం ఇస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ప్రత్యామ్నాయంగా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్లు సైతం వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment