సాక్షి, వరంగల్: తన రాజకీయ భవిష్యత్తు గురించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో చర్చించిన అనంతరమే తాను బీజేపీలో చేరానని రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. టీడీపీపై వ్యతిరేకతతోనో, లేక చంద్రబాబుపై కోపంతోనో తాను పార్టీకి రాజీనామా చేయలేదని తెలిపారు. తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీలో చేరానని పేర్కొన్నారు. వరంగల్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌కు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీని తెలంగాణలో కనిపించకుండా చేయడంలో ఆయన విజయవంతమయ్యారని అన్నారు.
తాను రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకోవాలా లేక పార్టీ మారాలా అన్న విషయంపై చంద్రబాబుతో సుధీర్ఘంగా చర్చించానని వెల్లడించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ను ఎదుర్కొవాలంటే రాజకీయ పునరేకీకరణ జరగాలని, దానికి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకత్వం జాతీయ స్థాయిలో గర్వపడేలా ఉంది కాబట్టే పార్టీలో చేరాన్నన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో నిజమైన ఉద్యమ కారులెవ్వరూ ప్రశాంతంగా లేరని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, అందుకే నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment