సాక్షి, హన్మకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రసవత్తర పోటీ నెలకొంది. టీఆర్‌ఎస్, ప్రజాకూటమి, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి 21 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నా పోటీ ముగ్గురు మధ్యనే ఉంది. టీఆర్‌ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, ప్రజా కూటమి నుంచి టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు పోటీలో ఉన్నారు. రేవూరి ప్రకాశ్‌రెడ్డి గతంలో నర్సంపేట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ధర్మారావు బీజేపీ అభ్యర్థిగా హన్మకొండ నియోజకవర్గం నుంచి 1999లో గెలిచారు. గత ఎన్నికల సందర్భంగా ఉద్యమ ప్రభావం ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. దీంతో పోటీ రసవత్తరంగా మారుతోంది. ఒకరిపై మరొకరు కత్తులు దూస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.
దాస్యం వినయ్‌భాస్కర్ (టీఆర్‌ఎస్)
బలాలు
- టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు
- నిత్యం ప్రజల మధ్య ఉండడం, ప్రజల వద్దకు నేరుగా వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడం
- ఆంధ్ర పార్టీగా టీడీపీకి ముద్ర... కూటమి నుంచి ఆ పార్టీ అభ్యర్థి బరిలో ఉండడం
- మంత్రి కేటీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి చేసిన అభివృద్ధి పనులు
- కార్మిక సంఘాలు, చిరు వ్యాపారులతో ఉన్న అనుబంధం
- మాజీ మంత్రి, సోదరుడు ప్రణయ్‌భాస్కర్‌పై ఉన్న అభిమానం
- అభ్యర్థిగా ముందుగా ప్రకటించడం, ముందు నుంచి ప్రచారంలో ఉండడం
బలహీనతలు
- టీఆర్‌ఎస్ ప్రభత్వంపై, తాజా మాజీ ఎమ్మెల్యేగా వ్యతిరేకత
- భూ కబ్జాదారునిగా ప్రచారం కావడం
- అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని, కమీషన్ల కోసం అభివృద్ధి పనులు ఆపారని అపవాదు
- కాజీపేటలో వ్యాగన్ పరిశ్రమ స్థల సేకరణను పట్టించుకోవడం లేదనే ఆరోపణ
- నియోజకవర్గానికి ఆశించిన మేర ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ఏర్పాటు కాకపోవడం
రేవూరి ప్రకాష్‌రెడ్డి (టీడీపీ)
బలాలు
- టీఆర్‌ఎస్ ప్రభుత్వం, తాజా మాజీ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత
- ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ప్రజా కూటమిగా ఏర్పాటు కావడం
- రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ హామీ
- వివాద రహితుడు కావడం, వ్యక్తిగతంగా అతనికున్న ఇమేజ్, పార్టీ మారకుండా నిబద్ధతతో ఉండడం.
- గతంలో నర్సంపేటలో ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి పనులతో ఉన్న మంచితనం
- కాంగ్రెస్ నుంచి పోటీపడిన నాయిని రాజేందర్‌రెడ్డితో పాటు ప్రజా కూటమిలో అన్ని పక్షాలు కలిసిరావడం
- మేధావి వర్గంలో సానుకూల దృక్పథం
బలహీనతలు
- ఆంధ్ర పార్టీగా టీడీపీకి ఉన్న ముద్ర
- స్థానికుడు కాదనే ప్రచారం
- కూటమిలోని పార్టీల ఓట్ల బదిలీపై సందిగ్ధం
- టీడీపీకి గట్టి పునాదులు లేకపోవడం, ఇతర పార్టీలపై ఆధారపడడం.
- ఆలస్యంగా టికెట్ కేటాయించడం, ప్రచారం ఆలస్యం కావడం
మార్తినేని ధర్మారావు (బీజేపీ)
బలాలు
- ప్రభుత్వం, గత ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత, ప్రజా కూటమి నుంచి ఆంధ్ర పార్టీగా ముద్రపడిన టీడీపీ అభ్యర్థి ఉండడం
- గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి సుపరిచితుడు కావడం
- వరంగల్ నగరానికి కేంద్రం నుంచి స్మార్ట్ సిటీ, అమృత్, హృదయ్ పథకాల ద్వారా రూ.కోట్లలో నిధులు తీసుకురావడం
- వివాద రహితుడు
- ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ప్రజల్లో ఆదరణ
- గతంలో చేసిన అభివృద్ధి పనులు
బలహీనతలు
- బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాలు
- నియోజకవర్గంలో బీజేపీకి పూర్తిస్థాయిలో పట్టు లేకపోవడం
- ప్రచారం ఆలస్యం కావడం
- ఎన్నికల తర్వాత ప్రజల్లో లేకపోవడం
Comments
Please login to add a commentAdd a comment