* రిమ్స్‌లో సకాలంలో అందని వైద్యం
* నేలపైనే గర్భిణి ప్రసవం
* అరగంటకుపైగా నరకయాతన
* వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపాటు
ఆదిలాబాద్ రిమ్స్ : కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రిమ్స్ ఆస్పత్రికి అధునాతన వైద్యం అందుతుందనే ఆశతో రోగులు వస్తే నిరాశే ఎదురవుతోంది. అసలే సౌకర్యాలు లేని ఈ ఆస్పత్రికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం తోడవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రినే దేవాలయంలా భావించి ఇక్కడికి వచ్చే ప్రజల పట్ల మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. దీంతో రిమ్స్ అభాసుపాలవుతోంది. శనివారం రిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకున్న సంఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ నిండుచూలాలు నేలపైనే ప్రసవించాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉండగా.. ఆ పరిస్థితిలో ఆమె అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. తమ బాధ్యతను విస్మరించిన వైద్యులు, సిబ్బంది ఏం పట్టనట్లుగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడ్డారు.
నిండు చూలాలి నరకయాతన..
తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన గోరిబి తన కూతురు రిజ్వానను ఆస్పత్రికి తీసుకొచ్చింది. నిండు చూలాలైన ఆమెను రిమ్స్‌కు తీసుకురాగానే ఓపీ విభాగంలో పేరు నమోదు చేయించింది. రశీదు తీసుకున్న అనంతరం సంబంధిత వైద్యుని వద్దకు వెళ్లారు. అక్కడ ఆ వైద్యుడు చూడకుండానే రశీదును చూసి తన కేసు కాదని.. మరో వైద్యుని వద్దకు వెళ్లాలని పంపించాడు. దీంతో సదరు వైద్యుడి గది తెలియక తన కూతురును పట్టుకుని తల్లి గోరిబి ఆస్పత్రి అంతా తిరిగింది. అప్పటికే నొప్పులు రావడంతో ఓపీ విభాగంలోని పై అంతస్థులో గల ఏఆర్‌టీ సెంటర్ వద్ద ఆ గర్భిణి పడిపోయింది.
దిక్కుతోచని స్థితిలో ఎన్నో అవస్థలు పడి నేలపైనే ప్రసవించింది. అరగంటకు పైగా నరకయాతన అనుభవించి ఓ పాపకు జన్మనిచ్చింది. ఇంతటి ఘోరం జరుగుతున్నా అక్కడి సిబ్బందికి, వైద్యులకు సమాచారం లేకపోవడం గమనార్హం. ఆస్పత్రికి వచ్చిన కొంత మంది స్థానికులు రిమ్స్ ఆర్‌ఎంవో వినాయక్‌కుమార్‌కు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి సిబ్బంది పంపించాడు. తల్లీబిడ్డలను మెటర్నిటీ వార్డుకు తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారు.
రిమ్స్‌కు వస్తే బిక్కుబిక్కే..
జిల్లా రిమ్స్ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే వారిలో సగానికిపైగా గ్రామీణ పేద ప్రజలే. ఇక్కడికి వచ్చే వారిలో చాలా మందికి ఆస్పత్రిలో ఎక్కడికి పోతే వైద్యం అందుతుందో తెలియదు. ఆస్పత్రికి వచ్చిన తర్వాత వైద్య పరీక్షల కోసం గంటల తరబడి తిరగాల్సిందే. ఇక నిరాక్షరాస్యులు ఆస్పత్రికి వస్తే అంతే సంగతి. ఒక రోజులో వారికి వైద్యం అందడం గగనమే. ఇలాంటి వారి కోసం ఆస్పత్రిలో విచారణ కౌంటర్ ఏర్పాటు చేసి ఆస్పత్రి సమాచారం చెప్పేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయాలి. ఎలాంటి సమాచారం కావాలన్నా రోగులు ఇక్కడ అడిగి తెలుసుకునే వీలుంటుంది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో రిమ్స్‌లో సరైన సమాచారం అందించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడం, ఉన్న వారు సైతం సహకరించకపోవడంతో నిత్యం ఆస్పత్రికి వచ్చే రోగులు అవస్థలు పడుతున్నారు.
ఓపీ చిట్టి తీసుకుంది మొదలు వైద్యుడి వద్దకు వెళ్లాలంటే కచ్చితంగా ఆస్పత్రి అంతా తిరగాల్సిన పరిస్థితి రోగులకు నిత్యం ఎదురవుతోంది. ఒకవేళ సంబంధిత వైద్యుడికి చూపించిన తర్వాత అదే రోజు రక్త పరీక్షలు, ఎక్స్‌రేల పేరిట చికిత్స చేయరు. వాటి రిపోర్టులు రావాలంటే రెండు రోజులు పట్టాల్సిందే. అసలే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి మూడు రోజులపాటు ఆస్పత్రి చుట్టూ తిరిగడం వల్ల ఇటు ఆర్థిక భారంతోపాటు, అటు ఉపాధి కూలీ కూడా కోల్పోతున్నారు. దీనంతటికి కారణం ఆస్పత్రికి వచ్చే వారికి సరైన సమాచారం అందకపోవడమే.
పేరుకే పే..ద్ద ఆస్పత్రి
Published Sun, Nov 2 2014 4:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM
Advertisement
Advertisement