నకిరేకల్ : జిల్లాలో సంచలనం సృష్టించిన ఆశ్రమ చిన్నారుల అదృశ్యంపై ఉన్నతాధికారులు స్పందించారు. మోత్కూరు పట్టణంలో స్మైల్ వెల్ఫేర్‌ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అబ్బాస్ చిల్డ్రన్ హోం నుంచి చిన్నారులు అదృశ్యం అయిన విషయం తెలిసిందే. దీనిపై శనివారం మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర రీజనల్ జా యింట్ డెరైక్టర్ రాజ్యలక్ష్మీ విచారణ జరిపారు. నకిరేకల్‌ని సంతోష్‌నగర్‌లో నివాసముంటున్న ఆశ్రమ నిర్వాహకురాలు కవిత గృహాన్ని ఆర్‌జేడీ, జిల్లా ఇన్‌చార్జ్ ఐసీడీఎస్ పీడీ మోతి, సీఐ శ్రీనివాస్‌రావు సందర్శించారు. నిర్వాహకురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె వద్ద ఉన్న ఐదుగురు చిన్నారులు ఐతరాజు విష్నేష్, వేముల సురేష్, వేముల శివ, నోముల రవి, నోముల సాయి విచారించారు.
జ్వరం వచ్చిందని..
జ్వరం రావడంతోనే అనాథాశ్రమంలోని 22 మంది చిన్నారులను వారి సంరక్షకులకు అప్పగించి మిగిలిన ఐదుగురు అనాథలను తన వద్ద ఉంచుకున్నట్టు ఆశ్రమ నిర్వాహకురాలు కవిత అధికారులకు వివరణ ఇచ్చింది. కవిత వద్ద ఉన్న ఆ చిన్నారులను నల్లగొండలోని బాలసదన్‌కు తరలించాలని ఆర్జేడీ ఐసీడీఎస్ సిబ్బందిని ఆదేశించారు.
పిల్లలను ఇబ్బంది పెడితే చర్యలు: ఆర్‌జేడీ
ఆశ్రమాల పేరుతో నిరుపేద, అనాథ పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర రిజినల్ జాయింట్ డెరైక్టర్ రాజ్యలక్ష్మి హెచ్చరించారు. ఆమె విలేకరులతో మాట్లాడారు. విదేశాల నుంచి నిధులు వస్తాయని ఆశతో కొంత మంది ఆశ్రమాలు స్థాపించి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. మోత్కూరులో కూడా అబ్బాస్ పిల్లల ఆశ్రమం నిర్వాహకురాలు కవిత కూడా అదే పని చేయబోయిందని పేర్కొన్నారు. గత జనవరిలో ఇలాంటి ఆశ్రమాలు ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ నోటిఫికేషన్ జారీచేశారని గుర్తుచేశారు. అయిన మోత్కూర్ అబ్బాస్ పిల్లల అనాథాశ్రమం నిర్వాహకులు దరఖాస్తులు కూడా చేసుకోలేదన్నారు. ఆశ్రమంలో ఉండాల్సిన పిల్లలు ఇతర ప్రాంతాలకు ఇష్టానుసారంగా తరలించండం చట్టరీత్యా నేరమన్నారు. చీటింగ్ చేసిన కవితపై శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఆమె వెంట నకిరేకల్, రామన్నపేట సీఐలు శ్రీనివాసరావు, బాల గంగిరెడ్డి, ఐసీడీఎస్ ఏపీడీ కృష్ణవేణి, నకిరేకల్ మోత్కూర్ మండలాల ఐసీడీఎస్ సూపర్ వైజర్‌లు అరుణశ్రీ, సావిత్రమ్మ, డీసీపీఓ సైదులు ఉన్నారు.
ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తాం : ఓఎస్‌డీ
నల్లగొండ క్రైం : మోత్కూరులోని స్మైల్ చైల్డ్ హోం కేంద్రాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి నిర్వాహకులను అరెస్టు చేస్తామని జిల్లా ఇన్‌చార్జ్ ఏఎస్పీ, ఓఎస్‌డీ రాధాకిషన్‌రావు తెలిపారు. కేంద్రంలోని 27 మంది విద్యార్థుల అదృశ్యంపై శనివారం ఆయన స్పందించారు. తక్కువ మంది పిల్లలు ఉన్నప్పటికీ రికార్డులో ఎక్కువగా చూపించారని తేలిందన్నారు. 22 మంది పిల్లలు చైల్డ్ హోం కేర్ సెంటర్‌లో ఉండగా 16 మంది పిల్లలు మోత్కూరు మండలానికి సంబంధించిన వాళ్లు కాగా మరో ఐదుగురు పిల్లలను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారని తెలిపారు. ఇతర దేశాల నుంచి డబ్బులు లాగేందుకు ఎక్కువ మంది పిల్లలను చూపించారన్నారు.
చిన్నారుల అదృశ్యంపై ఆర్జేడీ విచారణ
Published Sun, Nov 2 2014 4:37 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM
Advertisement
Advertisement