చిచ్చురేపిన సభ్యత్వ నమోదు | Rohit Reddy Assosiates Creates Controversy In TRS Membership Drive | Sakshi
Sakshi News home page

చిచ్చురేపిన సభ్యత్వ నమోదు

Published Wed, Sep 11 2019 9:00 AM | Last Updated on Wed, Sep 11 2019 9:00 AM

Rohit Reddy Assosiates Creates Controversy In TRS Membership Drive - Sakshi

తాండూరులో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు చేస్తున్న నాయకులు

సాక్షి, తాండూరు: పట్టణంతో పాటు పలు మండలాల్లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు చేపట్టడం వివాదాస్పదంగా మారింది. గడువు ముగిసిన తర్వాత, స్థానిక ఇన్‌చార్జ్‌లకు కనీస సమాచారం ఇవ్వకుండా మెంబర్‌షిప్‌లు ఇవ్వడంపై పలువురు నాయకులు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు ఈ సారి టీఆర్‌ఎస్‌ సభ్యత్వాలు తీసుకున్నారని మంత్రి కేటీఆర్‌ ఇటీవల ప్రకటించారు. పార్టీ సభ్యత్వం ముగిసిందని అధికారికంగా స్పష్టంచేశారు. అయితే రెండు రోజులుగా తాండూరులో కొనసాగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేతల మధ్య చిచ్చు రేపింది.

ఇప్పటికే సభ్యత్వ నమోదు పూర్తి చేసి.. వివరాలను పార్టీ ఇన్‌చార్జ్‌లకు అందించారు. ఇదిలా ఉండగా ఆయా మండలాలు, మున్సిపల్‌ అధ్యక్షులకు సమాచారం ఇవ్వకుండా మళ్లీ సభ్యత్వ నమోదు చేపట్టడం వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు చేపట్టిన ఈ కార్యక్రమంపై పలువురు నాయకులు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. నియోజకవర్గంలోని మండలాల పార్టీ అధ్యక్షులు, తాండూరు పట్టణ అధ్యక్షుడు గత నెలలో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. సభ్యత్వం పూర్తి చేసి సభ్యత్వ రశీదు బుక్కులతో పాటు సమకూరిన నగదును పార్టీకి చెల్లించారు. తమకు ఇచ్చిన టార్గెట్‌ పూర్తి చేశామని నాయకులంతా ఊపిరి పీల్చుకున్నారు. 

గ్రామ కమిటీల నియామకం.. 
మండలాల్లో, పట్టణంలో గ్రామ కమిటీలతో పాటు, వార్డు కమిటీల ఏర్పాటు సైతం తుది దశకు చేరుకొంది. ఇప్పటికే గ్రామ కమిటీల అధ్యక్షులతో పాటు కార్యవర్గ సభ్యుల పేర్లను ప్రకటించారు. అయితే రెండు రోజులుగా కొంత మంది కార్యకర్తలు పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహిస్తూ కనిపిస్తున్నారు. ఇది చూసిన స్థానిక నాయకులు విషయాన్ని తాండూరు పట్టణ అధ్యక్షుడు అబ్దుల్‌ రవూఫ్‌తో పాటు మండలాల అధ్యక్షులకు చెప్పారు. సభ్యత్వ నమోదు చేస్తున్నది తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులుగా గుర్తించారు. 

మరోసారి వర్గపోరు.. 
తాండూరు నియోజకవర్గంలో వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మధ్య కోల్డ్‌ వార్‌ కొనసాగుతోంది. స్థానికంగా పట్టు సాధించేందుకు ఇద్దరు నేతలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మహేందర్‌రెడ్డి వర్గీయులను రెచ్చగొట్టే విధంగా.. ఎమ్మెల్యే వర్గీయులు.. గడువు ముసిగిన తర్వాత సభ్యత్వం చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఫిర్యాదు చేశాం 
టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసి బుక్కులు, నగదును ఇన్‌చార్జ్‌లకు అందించాం. సభ్యత్వం గడువు ముగిసిన తర్వాత ఎమ్మెల్యే వర్గీయులు మెంబర్‌షిప్‌ చేస్తున్నారు. పార్టీ స్థానిక ఇన్‌చార్జ్‌లకు సైతం ఈ విషయాన్ని చెప్పడం లేదు. దీనిపై పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గట్టు రామచందర్‌రావుతో పాటు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశాం. 
– అబ్దుల్‌ రవూఫ్, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement