Telangana Cabinet Expansion On Aug 23rd, MLC Patnam Mahender Reddy Into Cabinet - Sakshi
Sakshi News home page

Patnam Mahender Reddy: మంత్రివర్గంలోకి ‘పట్నం’.. రేపు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం

Published Tue, Aug 22 2023 8:12 AM | Last Updated on Tue, Aug 22 2023 10:59 AM

Telangana Cabinet Expansion On Aug 23rd  Patnam Mahender Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ టికెట్‌ కేటాయింపులో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సయోధ్య కుదిర్చారు. తాండూరు టికెట్‌పై రాజీఫార్ములాలో భాగంగా శాసనమండలి సభ్యుడిగాఉన్న పట్నం మహేందర్‌రెడ్డి ఈ నెల 23న బుధవారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉదయం 11.30కు రాజ్‌భవన్‌లో పట్నం రాష్ట్ర మంత్రివర్గంలో చేరతారు.

2014 ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌లో చేరిన మహేందర్‌రెడ్డి తాండూరు నుంచి గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థి పైలట్‌ రోహిత్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. రోహిత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరిన నాటి నుంచి ఇద్దరు నేతల నడుమ విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకుని పలుమార్లు బహిరంగంగా విమర్శలకు పూనుకున్నారు.
చదవండి: పార్టీ ధిక్కారానికి పాల్పడితే వేటే.. 

2023లో తాండూరు అసెంబ్లీ టికెట్‌ కోసం ఇద్దరు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్న నేపథ్యంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మధ్యవర్తిత్వం వహించారు. రోహిత్‌ రెడ్డికి టికెట్‌ ఇస్తే సహకరించాలని మహేందర్‌రెడ్డిని కోరడంతో పాటు ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న బెర్త్‌లో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మండలి నుంచి కేబినెట్‌లోకి తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

2021 మే నెలలో ఈటలను మంత్రివర్గం నుంచి భర్తరఫ్‌ చేసిన నాటి నుంచి కేబినెట్‌ బెర్త్‌ ఖాళీగా ఉంది. ప్రస్తుతం కుదిరిన రాజీ ఫార్ములామేర  కేబినెట్‌లో ఖాళీగాఉన్న బెర్త్‌లో పట్నం మంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. మహేందర్‌రెడ్డి సుమారు 3 నెలలపాటు మంత్రిగా అధికారిక హోదాలో పనిచేస్తారు.      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement