వికారాబాద్: తాండూరులో టికెట్ పంచాయితీ మరోమారు తెరపైకి వచ్చింది. ఈ అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతుండడంతో మళ్లీ రచ్చమొదలైంది. ఇప్పటికే ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎన్నికల సమరం సమీపిస్తుండడంతో పార్టీ అధిష్టానం సైతం బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టింది.
తాండూరు నియోజకవర్గ టికెట్ కేటాయింపు విషయమై పట్నం మహేందర్‌రెడ్డి శిబిరంలో అలజడి మొదలయింది. నిన్నటి వరకు బీఆర్‌ఎస్ టికెట్ ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికే వస్తుందంటూ ధీమాతో ఉన్న ఆయన అనుచరుల్లో ఒక్కసారిగా నైరాశ్యం నెలకొంది. శనివారం మంత్రి హరీశ్‌రావు, ఎంపీ రంజిత్‌రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం.
తాండూరు అసెంబ్లీ స్థానంలో పోటీ విరమించుకుంటే మంత్రి పదవితోపాటుగా రాజ్యసభకు పంపించేందుకు సీఎం కేసీఆర్ అనుకూలంగా ఉన్నారని నచ్చజెప్పారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆదివారం విషయం తెలుసుకున్న పట్నం వర్గీయులు మండల స్థాయి నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఫోన్లు చే స్తూ ఆందోళన చెందుతున్నారు. అయితే పట్నం ఈ విషయమై ఎలాంటి నిర్ణయానికి రాలేదు.
జంబో జాబితా తర్వాతే నిర్ణయం..
బీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జంబో జాబితా బయటకు వచ్చాకే పట్నం మహేందర్‌రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని ఆయన అనుచరగణం అంటున్నారు. కాగా తాండూరు నుంచి టికెట్ రాకపోతే తన వెంట నడిచేవారెందరున్నారని ఆయన లెక్కలేసుకుంటున్నారు.
ఇప్పటికే కొంత మంది నాయకులు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి అనుకూలంగా ఉంటూ డబుల్ గేమ్ ఆడుతున్నారంటూ ఆయన సన్నిహిత వర్గాలతో అన్నట్లు తెలిసింది. నియోజకవర్గ స్థాయిలో మహేందర్‌రెడ్డికి బలమైన కేడర్ ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన వారికి టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో పైలట్ పేరు తొలి జాబితాలోనే వస్తుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
పదవుల కోసం టికెట్ త్యాగం చేస్తారా..?
తాండూరు నియోజకవర్గం నుంచి 1994 నుంచి 2018 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం మహేందర్‌రెడ్డి ఆరు సార్లు పోటీ చేయగా .. నాలుగు సార్లు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లోనూ తాండూరు నుంచే పోటీ చేస్తానంటూ ఆయన పలుమార్లు ప్రకటించారు. అయితే శనివారం బీఆర్‌ఎస్ పెద్దలతో జరిగిన చర్చల్లో పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రి పదవితో పాటు సతీమణి జెడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డిని రాజ్యసభకు పంపిస్తామని హామీ ఇచ్చారు.
ఈ విషయమై ఆయన నియోకవర్గ ముఖ్య నాయకుల అభిప్రా యం తీసుకుంటున్నారు. మరో రెండు మూడు రో జుల్లో తాండూరు అసెంబ్లీకి పోటీ చేస్తారా.. లేక పదవులతో సైలెంట్ అయిపోతారా అనేది స్పష్టత రానుంది. ఈ విషయమై పట్నం మహేందర్‌రెడ్డిని వివరణ కోరగా తాను తాండూరు అసెంబ్లీని వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పోటీ చేయడం ఖాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment