అర్బన్‌లోనూ ఆధిపత్యపోరు | Row About D srinivas Suspension In TRS | Sakshi
Sakshi News home page

అర్బన్‌లోనూ ఆధిపత్యపోరు

Published Sun, Jul 1 2018 8:43 AM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

Row About D srinivas Suspension In TRS - Sakshi

డి. శ్రీనివాస్‌ (పాత ఫోటో)

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గానికి పరిమితం అనుకున్న ఆధిపత్య పోరు నిజామాబాద్‌ అర్బన్‌లో కూడా అంతర్గతంగా కొనసాగిందా.. ? ఇప్పటి వరకు నివురు గప్పిన నిప్పులా గ్రూపు విభేదాలు లోలోపల రగిలాయా..? రాజ్య సభ సభ్యులు, ధర్మపురి శ్రీనివాస్‌ (డీఎస్‌)పై క్రమశిక్షణ చర్యల ప్రతిపాదన క్రమంలో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు విడుదల చేసిన లేఖను పరిశీలిస్తే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ లేఖలో డీఎస్‌ రూరల్‌తో పాటు, అర్బన్‌లో కూడా గ్రూపు రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని స్పష్టంగా ఆరోపించారు. దీంతో ఇన్నాళ్లూ రూరల్‌ నియోజకవర్గంలోనే రచ్చకెక్కిన ఆధిపత్య పోరు అర్బన్‌ను కూడా తాకినట్లు తేటతెల్లమైంది. డీఎస్‌ కుమారుడు, మాజీ మేయర్‌ సంజయ్‌ ఈ ఎన్నికల్లో అర్బన్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసే యోచనలో ఉన్నారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ రేసులో సంజయ్‌ ఉంటారనే ప్రచారం జరిగింది. ఇది సహజంగానే స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తను అసంతృప్తికి గురి చేసింది. ఈ వ్యవహారాన్ని బిగాల పలుమార్లు పార్టీ ముఖ్యనేతలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే అర్బన్‌లో ఇలా అంతర్గతంగా కొనసాగిన విభేదాలు ఈ లేఖతో బహిర్గతమయ్యాయి.  

డీఎస్‌ ప్రభావం ఏ మేరకు..? 
డీఎస్‌కు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఆయా పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. బలమైన బీసీ నేతగా ఆయనకు పేరుంది. ఈ నేపథ్యంలో డీఎస్‌పై అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటే ఏమేరకు ప్రభావం చూపుతుంది అనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. జిల్లాలో రూరల్, అర్బన్‌ నియోజకవర్గాల్లో బలమైన అనుచర వర్గం ఉంది. ఆర్మూర్‌ నియోజకవర్గంలో కూడా ఆయనకు పట్టుంది. నందిపేట్‌ మండలం అధికార పార్టీ ముఖ్యనేత సుదర్శన్‌ డీఎస్‌తో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. డీఎస్‌ స్వస్థలం వేల్పుర్‌ మండలం కావడంతో బాల్కొండ నియోజకవర్గంలో కూడా ఆయనకు సంబంధాలున్నాయి. గతంలో ఎమ్మెల్యేల పనితీరుపై అధినేత కేసీఆర్‌ సమీక్ష సందర్భంగా డీఎస్‌ సేవలను బాల్కొండ నియోజవర్గంలో కూడా వినియోగించు కోవాలని స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డికి సూచించడం అక్కడ డీఎస్‌కు ఉన్న సంబంధాలను తెలియజేస్తోంది. మరోవైపు ముస్లిం మైనారిటీల్లో కూడా డీఎస్‌కు బలమైన పట్టుంది. ఈ నేపథ్యంలో ఆయనపై క్రమశిక్షణ చర్యల ప్రతిపాదన అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. 

కొనసాగుతున్న సస్పెన్స్‌.. 
డీఎస్‌పై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజాప్రతినిధులు తీర్మానం చేసిన నేపథ్యంలో అధినేత కేసీఆర్‌ కీలక నిర్ణయంపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. తీర్మానం చేసిన రోజే బుధవారం మధ్యాహ్నం డీఎస్‌ సీఎంతో భేటీ అవుతారని, సాయంత్రం అపాయింట్‌మెంట్‌ ఉందనే ప్రచారం జరిగింది. సీఎం కేసీఆర్‌ పిలుపు కోసం వేచి చూస్తున్నానని డీఎస్‌ కూడా ప్రకటించారు. ఇంత వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో సస్పెన్స్‌ కొనసాగుతోంది. భూపతిరెడ్డి మాదిరిగానే డీఎస్‌పై చర్యల అంశాన్ని అధినేత వేచిచూసే ధోరణితో ఉంటారా? లేదా కీలక నిర్ణయమేదైనా తీసుకుంటారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో లేఖ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందోనని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు డీఎస్‌ ముఖ్య అనుచరగణం ఈ ఎపిసోడ్‌పై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎక్కడా అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement