ప్రభుత్వ విభాగాల కరెంటు బిల్లుల తీరిది
నెలనెలా పెరిగిపోతుండడంతో డిస్కంలపై ఆర్థిక భారం
ఎప్పటికప్పుడు సర్దుబాటు చేయాలని ఇంధనశాఖ ప్రతిపాదన
హైదరాబాద్: ప్రభుత్వ విభాగాలకు చెందిన కరెంటు బకాయిలు రూ.1,500 కోట్లకు చేరుకున్నాయి. ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న విద్యుత్తు పంపిణీ సంస్థలకు ఇవి మరింత షాక్ కొడుతున్నాయి. ఏటా సబ్సిడీల భారంతో పాటు సర్కారు చెల్లించాల్సిన విద్యుత్తు బకాయిలు డిస్కంలకు తడిసి మోపెడవుతున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు రాబట్టుకోకపోతే వార్షిక ఆదాయ వ్యయాల పట్టిక డిస్కంలను ఆందోళనకు గురి చేస్తోంది. వ్యవసాయ విద్యుత్తుకు ఇచ్చే సబ్సిడీ ఏమూలకు సరిపోవటం లేదని డిస్కంలు పదేపదే చేసిన విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ప్రతి నెలా రూ.100 కోట్ల సబ్సిడీ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే తరహాలో సర్కారు విభాగాల కరెంటు బకాయిలను సర్దుబాటు చేస్తే డిస్కంల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఇటీవలే ఇంధన శాఖ ప్రభుత్వానికి సూచించింది. ఈ నివేదిక ప్రకారం 13 విభాగాలు డిస్కంలకు రూ.1,453 కోట్లు బకాయి పడ్డాయి.
ఈ ఏడాది ఆగస్టు వరకే టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌కు రూ.961 కోట్లు, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌కు రూ. 492 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. గడచిన మూడు నెలల్లో ఈ బకాయిల భారం మరో రూ.50 కోట్లు పెరిగిందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి. తాగునీటి, సాగునీటి అవసరాలు, వీధిదీపాలతో ముడి పడి ఉన్న నాలుగు విభాగాలకు చెందిన బకాయిలే 80 శాతానికి మించి ఉన్నాయి. అత్యధికంగా పంచాయతీరాజ్ విభాగం రూ.885 కోట్లు, మున్సిపాలిటీలు రూ.153 కోట్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై విభాగాల రూ. 145 కోట్ల కరెంటు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని క్షేత్ర స్థాయి నుంచి వసూలు చేయకుండా.. శాఖాపరమైన పద్దుల సర్దుబాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి.
బకాయిలు రూ.1,500 కోట్లు
Published Wed, Dec 17 2014 4:40 AM | Last Updated on Wed, Sep 5 2018 4:12 PM
Advertisement