50 శాతం సీట్లు.. రూ.11లక్షల ఫీజు | Rs 11 lakhs of fee for 50% MBBS seats | Sakshi
Sakshi News home page

50 శాతం సీట్లు.. రూ.11లక్షల ఫీజు

Published Mon, Apr 27 2015 3:16 AM | Last Updated on Tue, Oct 16 2018 2:57 PM

50 శాతం సీట్లు.. రూ.11లక్షల ఫీజు - Sakshi

50 శాతం సీట్లు.. రూ.11లక్షల ఫీజు

* ఆ ప్రకారం ఎంబీబీఎస్ ఫీజులు పెంచాలి
* ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా సవరించాలి
* టీ సర్కారుకు విన్నవించనున్న ప్రైవేటు వైద్య కళాశాలలు

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ ఫీజులు  భారీగా పెరిగేఅవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కేటగిరీల్లో ఫీజులు పెంచినప్పటికీ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే పెద్దఎత్తున ఫీజులు పెంచినందున ఇక్కడా పెంచాలని ప్రైవేటు మెడికల్ కాలేజీలు కోరుతున్నాయి. దీనిపై ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించాయి. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. ప్రైవేటు కాలేజీలు కోరుతున్నట్లు భారీగా కాకుండా... ఎంతో కొంత పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ‘బి’, ‘సి’ కేటగిరీల్లోని అన్ని సీట్లకూ ఏకీకృతంగా రూ.11 లక్షల చొప్పున పెంచాలని యాజమాన్యాలు కోరుతున్నాయి.
 
1,050 సీట్లకు రూ. 11 లక్షల చొప్పున
తెలంగాణలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐదు మెడికల్ కాలేజీలు, ప్రైవేటు ఆధ్వర్యంలో 15 వైద్య కళాశాలలు ఉన్నాయి. 850 సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో, 2,100 సీట్లు ప్రైవేటు కాలేజీల్లో ఉన్నాయి. ప్రైవేటు సీట్లలో ‘ఎ’ కేటగిరీలోని 50 శాతం సీట్లు, ‘బి’ కేటగిరీలో 10 శాతం సీట్లను ఎంసెట్ ద్వారా కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. మిగిలిన ‘సి’ కేటగిరీ 40 శాతంలో 25 శాతం యాజమాన్య కోటా సీట్లు, 15 శాతం సీట్లు ఎన్‌ఆర్‌ఐ కోటా కింద భర్తీ చేస్తున్నారు. ఈ 40 శాతం సీట్లను కూడా ప్రస్తుతం ఎంసెట్ ఆధారంగానే భర్తీ చేస్తున్నారు. అయితే ‘బి’, ‘సి’ కేటగిరీల్లోని 50 శాతం సీట్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రైవేటు యాజమాన్యాలు కోరుతున్నాయి. అంటే మొత్తం 1,050 సీట్లకు సొంతంగా పరీక్ష పెట్టుకుని నింపుకోవాలని, వీటన్నింటికీ ఎన్‌ఆర్‌ఐ ఫీజుకు సరిసమానం చేస్తూ పెంచాలని ప్రైవేటు యాజమాన్యాలు కోరుతున్నాయి. ప్రస్తుతం ‘బి’ కేటగిరీ సీట్లకు రూ. 2.40 లక్షలు, ‘సి1’ కేటగిరీ సీట్లకు రూ. 9 లక్షలు, ‘సి2’ (ఎన్‌ఆర్‌ఐ) కోటా సీట్లకు రూ. 11 లక్షలు వసూలు చేస్తున్నారు. వీటన్నింటికీ ఎన్‌ఆర్‌ఐ కోటా మాదిరే రూ. 11 లక్షల ఫీజు చేయాలని ప్రైవే టు యాజమాన్యాలు కోరుతున్నాయి.
 
 ఫీజులు పెంచాలని కోరుతాం
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంబీబీఎస్ ఫీజులు పెంచినందున తెలంగాణలోనూ పెంచాలని సర్కారును కోరతామని తెలంగాణ ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీ మేనేజ్‌మెంట్ల సంఘం అధ్యక్షుడు సి.లక్ష్మీనర్సింహారావు చెప్పారు. ఏపీ ప్రకారం ఫీజులను సవరించాలన్న విషయం ప్రభుత్వ దృష్టిలోనూ ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు.  
 
 గత ఏడాదే పెంచినందున?
  తెలంగాణ ప్రభుత్వం గత ఏడాదే సి1 కేటగిరీ ఫీజు రూ. 5.5 లక్షల నుంచి 9 లక్షలకు పెంచింది. సి2 (ఎన్‌ఆర్‌ఐ) కేటగిరీ ఫీజు రూ. 5.5 లక్షల నుంచి 11 లక్షలకు పెంచింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఈ ఏడాది ఫీజు పెంచడం సబబుగా ఉండదనేది ప్రభుత్వ వర్గాల్లో చర్చ. పైగా నిబంధనల ప్రకారం ఏడాదికే ఫీజు పెంచడం కుదరదని అంటున్నారు. అయినా ప్రభుత్వం తలుచుకుంటే నిబంధనలకు సవరణలు చేసి ఫీజు పెంచుకోవచ్చని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ విషయం సీఎం కేసీఆర్ ముందుకెళ్లినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement