వాంటెడ్‌.. శవాలు! | Bibinagar AIIMS request to State Government for dead bodies | Sakshi
Sakshi News home page

వాంటెడ్‌.. శవాలు!

Published Sat, Aug 24 2019 2:34 AM | Last Updated on Sat, Aug 24 2019 2:34 AM

Bibinagar AIIMS request to State Government for dead bodies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభం అవుతున్నాయి మహాప్రభో.. మాకు శవాలు కావాలి, ఇస్తారా..’అంటూ బీబీనగర్‌ ఎయిమ్స్‌ రాష్ట్ర సర్కారుకు మొరపెట్టుకుంది. అయితే, గాంధీ ఆసుపత్రి నుంచి శవాలను పంపిస్తామని వైద్య విద్యా సంచాలకులు(డీఎంఈ) హామీ ఇచ్చారు.  ఈ నెల 27వ తేదీ నుంచి బీబీనగర్‌లోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌ మొదటి బ్యాచ్‌ ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభం అవుతున్నాయి.  ఎంబీబీఎస్‌ విద్యార్థులకు అనాటమీ డిసెక్షన్‌ కోసం శవాలు అవసరం. అయితే, గాంధీ ఆసుపత్రివారు ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు శవాలను విక్రయిస్తారు. ఒక్కో శవం ఖరీదు దాదాపు రూ.10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఉంటుంది. అయితే, ఎయిమ్స్‌కు శవాలను ఉచితంగా ఇస్తారా లేదా విక్రయిస్తారా అన్న దానిపై స్పష్టత రాలేదు.   చాలా సందర్భాల్లో శవాల కొరత ఉంటుంది.  

సందడి లేని ఎయిమ్స్‌... 
ప్రభుత్వం ఎంతో కృషి చేసి రాష్ట్రానికి ఎయిమ్స్‌ సాధించింది. అందుకోసం బీబీనగర్‌లో ఏకంగా 200 ఎకరాల భూమి ఇచి్చంది. అక్కడ నిమ్స్‌ ఆసుపత్రి భవనాలను కూడా ఉచితంగా అప్పగించింది. ఎయిమ్స్‌ సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీలు ఎంతో కృషిచేశారు.  అటువంటి ఎయిమ్స్‌ తరగతులు ఈ నెల 27వ తేదీన ప్రారంభం అవుతున్నా ఎటువంటి సందడి లేకపోవడం గమనార్హం. ఎయిమ్స్‌ కేంద్ర పరిధిలో ఉండటంతో తమకు ఎటువంటి సమాచారం ఇవ్వడంలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు అంటున్నాయి. ఎయిమ్స్‌ ప్రారంభమంటే ప్రధానమంత్రి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంటారని, కానీ బీబీనగర్‌ ఎయిమ్స్‌కు అలా చేసే అవకాశాలు లేవని అంటున్నాయి. ముఖ్యమంత్రితోనైనా ప్రారం¿ోత్సవానికి ఏర్పాట్లు చేస్తే బాగుండేదన్న చర్చ వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో నెలకొంది. పలు సందర్భాల్లో డీఎంఈతో చర్చలు జరిపిన ఎయిమ్స్‌ వర్గాలు ఇప్పుడు ఒక్క ముక్క కూడా ఏమీ చెప్పడంలేదంటున్నారు.  

అక్టోబర్‌ తర్వాతే ఓపీ సేవలు... 
ఎంబీబీఎస్‌ తరగతులతోపాటే ఓపీ సేవలు ప్రారంభం అవుతాయని అందరూ భావించారు. ఇప్పటికే నిమ్స్‌ అక్కడ ఓపీ సేవలు నిర్వహిస్తోంది. ఓపీ సేవల ప్రారంభానికి అనువైన వాతావరణం అక్కడుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంటున్నాయి. ఎయిమ్స్‌ వర్గాలు మాత్రం అక్టోబర్‌ తర్వాత ఓపీ సేవలు మొదలు పెడతామని చెబుతున్నట్లు సమాచారం. అప్పటిదాకా నిమ్స్‌ సేవలు కొనసాగించాలని కోరినట్లు తెలిసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement