పండించిన దిగుబడులను ఆరబెట్టుకునేందుకు..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పండించిన దిగుబడులను ఆరబెట్టుకునేందుకు.. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులు నిల్వ చేసేందుకు గిడ్డంగులు నిర్మించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు గోదాములు అవసరమని భావించిన రాష్ట్ర సర్కారు... ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 35 చోట్ల గిడ్డంగులను నిర్మించాలని యంత్రాంగం నిర్ణయించింది. సగటున రూ.50 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదిస్తున్న ఈ గోడౌన్లకు అనుబంధంగా ధాన్యం ఆరబెట్టేకునేందుకు వీలుగా ఫ్లాట్‌ఫాంలు కూడా నిర్మించనున్నారు. అకాల వర్షాలకు చాలా మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తులు తడిసిపోవడం, కొన్ని చోట్ల ధాన్యంలో తేమ ఉన్నట్లు గుర్తించినప్పటికీ, ఆరబెట్టే సౌకర్యం లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మార్కెట్ కమిటీలు, కొనుగోలు కేంద్రాల్లో వీటిని నిర్మించాలని యోచిస్తున్నామని, ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. ఉత్పత్తులను అమ్ముకునేందుకు వచ్చే రైతులు సేద తీరడానికి వీలుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.