తాండూరు : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతుల కల్పనకు తక్షణమే రూ.20 లక్షలు మంజూరు చేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ‘మంత్రి ఇలాఖా.. కాలేజీ ఇలాగా?’శీర్షికతో గురువారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మహేందర్‌రెడ్డి స్పందించారు. బుధవారంరాత్రి తాండూరులో బస చేసిన మంత్రి గురువారం ఉదయం నియోజకవర్గంలోని 12 గ్రామ పంచాయతీల ప్రారంభోత్సవానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ‘సాక్షి’ కథనాన్ని చూసి స్పందించారు.
పంచాయతీల ప్రారంభోత్సవాలను వాయిదా వేసుకుని వెంటనే తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకున్నారు. అప్పటికే మున్సిపల్ చైర్‌పర్సన్ సునీతాసంపత్, పలువురు కౌన్సిలర్‌లు, టీఆర్‌ఎస్ నేతలు అక్కడకు చేరుకున్నారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బెంచీలను పక్షం రోజుల్లో సమకూరుస్తామని, అందుకోసం రూ.20 లక్షలను వెంటనే మంజూరు చేస్తామని అన్నారు.
అదనపు తరగతి గదులను మంజూరు చేస్తానని హామీనిచ్చారు. ‘సాక్షి’కథనం విద్యార్థుల సమస్యకు దర్పణం పట్టిందన్నారు. నూతన గ్రామ పంచాయతీల ప్రారంభోత్సవాలున్నా ‘సాక్షి’కథనం చూడగానే మధ్యలోనే వెనుదిరిగి ఇక్కడికి వచ్చానని చెప్పారు. విడతలవారీగా కళాశాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment