సంగారెడ్డి క్రైం: సహకార బ్యాంకుల ద్వారా ఈ ఏడాది రూ.250 కోట్ల పంట రుణాలివ్వనున్నట్టు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో జిల్లాలోని 105 సహకార సంఘాల అధ్యక్షులు, సీఈఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 105 సంఘాలుండగా కేవలం ఐదు మాత్రమే లాభాల్లో ఉన్నాయన్నారు. ఈ మధ్యనే మరో 60 సంఘాలు లాభాల బాటలోకి వచ్చాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రూ.40 కోట్ల దీర్ఘకాలిక రుణాలను రైతుల నుంచి వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఐదెకరాలున్నా ట్రాక్టర్ లోన్..
రైతు దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోగా రుణం మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చైర్మన్ తెలిపారు. గతంలో 12 ఎకరాల భూమి ఉన్న వారికి ట్రాక్టర్ రుణం ఇచ్చే వారమని, ఇప్పుడు 5 ఎకరాల భూమి ఉన్న వారికి కూడా ఇస్తామన్నారు. గతంలో అన్ని రకాల రుణాలు రూ.350 కోట్ల మేర అందించామని, ఈ ఏడాది రూ.500 కోట్ల వరకు రుణాలిస్తామన్నారు. ఐదు నుంచి వేయి మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తామన్నారు. సహకార సంఘాలు ఆకాశమే హద్దుగా వ్యాపారం చేసేందుకు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు.
సిద్ధంగా ఎరువులు : జేసీ
ఖరీఫ్‌లో రైతులకు సకాలంలో అందించేందుకు వీలుగా 95 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను సిద్ధంగా ఉంచినట్టు జేసీ వెంకట్‌రాంరెడ్డి తెలిపారు. ఈ ఖరీఫ్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వారి నుంచి పెద్ద ఎత్తున దానయ సేకరించేందుకు పకడ్బందీ ప్రణాళికలు తయారు చేసినట్లు వివరించారు.
రేక్ పాయింట్‌ను మార్చాలి..
రైతుల నుంచి సహకార సంఘాలు పది శాతం మార్జిన్‌మనీ సేకరిస్తే ఆ డబ్బును కేంద్ర బ్యాంకు దగ్గర పెట్టుకోవడం వల్ల అవి నష్టాల పాలవుతున్నట్టు కోనాపూర్ సహకార సంఘం అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి అన్నారు. జహీరాబాద్‌లో ఉన్న రేక్ పాయింట్‌ను జిల్లా మధ్యలోకి మార్చాలని కోరా రు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ హుక్యా నాయక్, జిల్లా సహకార ఇన్‌చార్జి అధికారి సత్యనారాయణరెడ్డి, మార్క్‌ఫెడ్ ప్రతినిధులు, సహకార బ్యాంకు అధికారులు, పీఏసీఎస్ అధ్యక్ష, కార్యదర్శులు, డీఎల్‌సీఓలు పాల్గొన్నారు.
ఈ ఏడాది రూ.250 కోట్ల పంట రుణాలు
Published Sun, Jun 21 2015 4:48 AM | Last Updated on Sun, Sep 3 2017 4:04 AM
Advertisement