రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు బడ్జెట్‌లో కొంత ఊరట లభించింది. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ మినహా మిగతా అన్ని వర్సిటీలకు కొంత మేర కేటాయింపులను పెంచారు.
రూ. 416.15 కోట్లు కేటాయింపు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు బడ్జెట్‌లో కొంత ఊరట లభించింది. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ మినహా మిగతా అన్ని వర్సిటీలకు కొంత మేర కేటాయింపులను పెంచారు. ముఖ్యంగా ఉస్మానియా వర్సిటీకి కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చారు. బడ్జెట్‌లో యూనివర్సిటీలకు రూ. 416.15 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ రూ. 291.76 కోట్లతో పోల్చితే ఇది రూ. 124.39 కోట్లు అదనం. అయితే వర్సిటీలు అడిగిన నిధులతో పోల్చితే ఈ కేటాయింపులు తక్కువే కావడం గమనార్హం. ఉస్మానియా వర్సిటీకి గత బడ్జెట్‌లో రూ. 170.14 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 238.19 కోట్లు కేటాయించారు. ఇక కాకతీయ వర్సిటీకి రూ. 19.15 కోట్లను, శాతవాహన వర్సిటీకి రూ. 13.43 కోట్లను అదనంగా కేటాయించారు. ఆర్థిక మంత్రి ఈటెల సొంత జిల్లా కరీంనగర్‌లో ఉన్న శాతవాహన వర్సిటీకి కొంత వరకు ఎక్కువ కేటాయింపులు చేశారు. ఇక పదో షెడ్యూల్‌లో ఉన్న తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, చిత్తూరులోని ద్రవిడ వర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలకు రాష్ట్ర వాటా కింద నిధులు కేటాయించారు.
సాంకేతిక విద్యకు ప్రాధాన్యం: ఈసారి బడ్జెట్‌లో సాంకేతిక విద్యకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. గత బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయం కింద రూ. 181.11 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ. 253.80 కోట్లకు పెంచారు. ప్రణాళికా వ్యయం కింద గతేడాది రూ. 212.85 కోట్లు ఇవ్వగా... ఈసారి రూ. 255.41 కోట్లు కేటాయించారు. సాధారణ యూనివర్సిటీలే కాకుండా హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ ్ట్స వర్సిటీకి, జేఎన్టీయూ, దాని పరిధిలోని కాలేజీలకు నిధులను పెంచారు. జేఎన్టీయూకు గత ఏడాది రూ. 39.60 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ. 55.44 కోట్లకు పెంచారు. అంటే అదనంగా రూ. 15.84 కోట్లు కేటాయించారు.
జీతాలకే సరిపోవు?
వాస్తవానికి గత ఏడాది బడ్జెట్‌పైనే పెదవి విరిచిన విశ్వవిద్యాలయాలు ఈసారి భారీగా నిధులు ఇవ్వాలని కోరాయి. మొత్తంగా దాదాపు రూ. 310 కోట్లకుపైగా అదనంగా నిధులివ్వాలని కోరాయి. కానీ ప్రభుత్వం అదనంగా ఇచ్చింది. రూ. 124 కోట్లు మాత్రమే. మొత్తంగా వర్సిటీలకు ఈసారి బడ్జెట్ కేటాయింపులు ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకే సరిపోతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిశోధనలకు, ఆవిష్కరణలకు అవకాశమే ఉండదనే వాదన వినిపిస్తోంది.