విధులకు రాంరాం! | RTC Bus Strike In Ranga Reddy | Sakshi
Sakshi News home page

విధులకు రాంరాం!

Published Sun, Oct 6 2019 11:08 AM | Last Updated on Sun, Oct 6 2019 11:08 AM

RTC Bus Strike In Ranga Reddy - Sakshi

వికారాబాద్‌ డిపో వద్ద భారీ పోలీసు బందోబస్తు

సాక్షి, వికారాబాద్‌ : ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. సిబ్బంది ఎవరూ విధులకు హాజరు కాకపోవడంతో ఉదయం 10గంటల వరకు ఒక్క బస్సుకూడా డిపోల నుంచి బయటకు రాలేదు. ఆయా గ్రామాల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లే వారు ప్రైవేటు వాహనాల ను ఆశ్రయించారు.10 గంటల తర్వాత ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్ల సహకారంతో మూడు డిపోల నుంచి కొన్ని బస్సులు బయటకు వచ్చాయి. పోలీసు బందోబస్తుతో వీటిని నడిపించారు. కార్మికుల సమ్మెతో అత్యధిక బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు వ్యక్తులతో నడిచిన కొద్దిపాటి సర్వీసులు జనం అవస్థలను కొంతవరకు నిరోధించగలిగాయి.   

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు.. 
కార్మికుల సమ్మె కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ఆర్టీసీ అధికారులు.. అనుభవం ఉన్న 87మంది డ్రైవర్లను, 87మంది కండక్టర్లను ఎంపిక చేసి బస్సులు నడిపించారు. డ్రైవర్లకు రోజుకు రూ.1,500, కండక్టర్లకు రూ.1,000 ఇస్తామని చెప్పడంతో చాలా మంది నిరుద్యోగులు విధులు నిర్వర్తించేందుకు ముందుకు వచ్చారు. వికారాబాద్‌ డిపో పరిధిలో 22 ఆర్టీసీ, 2 ప్రైవేటు బస్సులు నడిపారు. తాండూరు డిపో పరిధిలో 30 ఆర్టీసీ బస్సులు, 1 ప్రైవేటు బస్సు, పరిగి డిపో పరిధిలో 17 ఆర్టీసీ, 15 ప్రైవేటు బస్సులు సేవలందించాయి.  

ఎస్పీ, ఏఎస్పీ పర్యవేక్షణ..
ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని పట్టణాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. డిపోలతో పాటు ఆర్టీసీ బస్టాండ్ల వద్ద పోలీసు బలగాలను మోహరించారు. డిపోల నుంచి వెళ్లిన బస్సులు ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లే వరకు ఎస్కార్ట్‌గా అనుసరించారు. వికారాబాద్‌ ఆర్టీసీ డిపోల వద్ద పరిస్థితిని ఎస్పీ నారాయణ, అడిషనల్‌ ఎస్పీ భాస్కర్‌ పర్యవేక్షించారు. కార్మికులు ఎలాంటి ఆందోళనకు దిగినా.. బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేసినా వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు.    

విధులకు హాజరు కాని కార్మికులు..
జిల్లా పరిధిలోని 3 ఆర్టీసీ డిపోలో పనిచేసే 1,111 మంది కార్మికుల్లో ఒక్కరు కూడా శనివారం విధులకు హాజరు కాలేదు. వికారాబాద్‌ డిపో ఎదుట ఉదయం 9గంటల సమయంలో కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులు తిరిగి వెళ్లిపోయారు.  

బస్సు అద్దాలు ధ్వంసం...  
వికారాబాద్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం ఉదయం పరిగి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వికారాబాద్‌ పోలీస్‌ శిక్షణ కేంద్రం సమీపంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బస్సును ఆపి ముందుభాగంలోని అద్దాలను ధ్వంసం చేశారు. కార్మికులకు వ్యతిరేకంగా బస్సులు నడపరాదంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు. బస్సును నడుపుతున్న డ్రైవర్, కండక్టర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.  

కాంగ్రెస్‌ నాయకుల నిరసన...  
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వికారాబాద్‌ కాంగ్రెస్‌ నాయకులు కార్మిక సంఘాల నాయకులతో కలిసి డిపో ఎదుట నిరసన చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తామని అధికారంలోకి రాకముందు చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు ఎందుకు మాట మార్చారన్నారు. డిపో ఎదుట నిరసన చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు సుధాకర్‌రెడ్డి, సత్యనారాయణ, అనంత్‌రెడ్డి, రత్నారెడ్డి, మధు, కిష్టారెడ్డితో పాటు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు గోపాల్, జీవీకే రెడ్డి, అశోక్‌లను అరెస్టు చేసి వికారాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచిపై వదిలేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement