తెలంగాణ..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ప్రకటనలో బుధవారం హైడ్రామా చోటు చేసుకుంది. కార్మిక సంఘాలు 43 శాతం ఫిట్‌మెంట్ డిమాండ్ చేస్తూ ఎనిమిది రోజుల క్రితం సమ్మె ప్రారంభించగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మూడు రోజుల క్రితం స్పందించారు. వెంటనే కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసి విషయాన్ని సమీక్షించారు. ఫిట్‌మెంట్‌ను తేల్చేందుకు భారీ కసరత్తు చేసిన సబ్‌కమిటీ.. 40శాతం వరకు ఇవ్వచ్చంటూ మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. మంగళవారం రాత్రి ఉపసంఘంతో భేటీ అయిన కేసీఆర్ ఫిట్‌మెంట్‌ను 43 శాతానికి మార్చారు. బుధవారం కార్మిక సంఘాలను తుది చర్చలకు ఆహ్వానించి వారి సమక్షంలోనే ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని భావించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంగుతినాల్సి వచ్చింది.
అంతమొత్తం ఏపీలో ఇవ్వడం సాధ్యం కాదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు. కానీ బుధవారం ఉదయం మనసుమార్చుకున్న ఆయన కూడా 43 శాతం ఫిట్‌మెంట్‌కు అంగీకరించారు. చంద్రబాబు నిర్ణయంతో కేసీఆర్ వెంటనే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఫిట్‌మెంట్‌ను కాస్తా 44 శాతానికి పెంచేశారు. వెరసి కార్మిక సంఘాలు డిమాండ్ చేసిన దానికంటే ఒక శాతం ఎక్కువే ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తొలుత 62 శాతం ఫిట్‌మెంట్‌ను డిమాండ్ చేయాలని కార్మిక సంఘాలు భావించినా.. అది మరీ ఎక్కువని భావించి వెనక్కు తగ్గి 43 శాతం డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇంత ఉదారంగా ఉంటారని ముందే ఊహిస్తే మరింత ఎక్కువ డిమాండ్ చేసే వారమని కార్మిక సంఘాల నేతలు వ్యాఖ్యానించడం కొసమెరుపు.
ఆంధ్రప్రదేశ్..
సాక్షి, హైదరాబాద్: గత ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ పెద్దగా పట్టించుకోకుండా హైకోర్టు తీర్పు ఆధారంగా కార్మికులను దారిలోకి తెచ్చుకోవాలనుకున్న ఏపీ ప్రభుత్వం హైడ్రామా మధ్య ఫిట్‌మెంట్ ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడి పనిచేసినట్టు తెలుస్తోంది. సమ్మెలోకి దిగిన తర్వాత 10వ తేదీన చర్చలకు పిలిచిన మంత్రివర్గ ఉపసంఘం పరిష్కారానికి కనీసం మూడు వారాల గడువు కావాలని కార్మిక సంఘాల నేతలను కోరారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన 12వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించినప్పటికీ 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వలేమని తేల్చారు. ఈ నేపథ్యంలోనే బుధవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ ఉపసంఘం రెండో దఫా కార్మికులతో చర్చలు జరిపింది. ఫిట్‌మెంట్ 33 శాతమిస్తామని ప్రతిపాదించారు. కుదరకపోవడంతో 38 శాతం వరకు వచ్చారు. ఇక చర్చలు సఫలం కావన్న భావనతో ఆ వివరాలపై మధ్యాహ్నం 12 గంటలకు మంత్రులు మీడియాతో మాట్లాడతారని సమాచారమిచ్చారు. ఈలోగా తెలంగాణ ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడానికి అంగీకరించిందనీ, స్వయంగా సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో వివరించబోతున్నారన్న సమాచారం ఏపీ మంత్రులకు అందడంతో హడావిడి మొదలైంది.
మంత్రులు ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపారు. ఆ వెంటనే 43 శాతం ఫిట్‌మెంట్‌కు అంగీకరించి మీడియా సమావేశం పెట్టి చెప్పారు. ఉదయం నుంచి జరిగిన చర్చల్లో ససేమిరా అన్న మంత్రులు చివర్లో ఒక్కసారిగా 43 శాతం అంగీకరించడంపై కార్మిక సంఘాల నేతలను సైతం విస్మయపరిచింది. అలా ప్రకటించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంకన్నా మనమే ముందున్నామంటూ టీడీపీలో ప్రచారం మొదలైంది. ఇది జరిగిన కొద్దిసేపటికే తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. దాంతో అనుకున్న క్రెడిట్ దక్కలేదే అని ఒక మంత్రి మీడియా సమక్షంలోనే నిట్టూర్చారు.
ఆద్యంతం హైడ్రామా..!
Published Thu, May 14 2015 4:57 AM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM
Advertisement
Advertisement